విజయనగరం జిల్లా భోగాపురం మండలం నందిగం గ్రామంలోని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. విశాఖలోని నక్కవానిపాలెం, సరస్వతీ పార్క్ కూడలి, పూర్ణామార్కెట్ ప్రాంతాల్లో దుర్గా మండపాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అన్ని చోట్లా నగదు నోట్లతో అమ్మవారిని అలంకరించారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఒక కోటీ 11 లక్షల 11 వేల 111 రూపాయలతో మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని అలంకరించారు. కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ధనలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మండప ప్రాంగణాన్ని డబ్బుతో అలంకరించారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులోని పోలేరమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల సంతబజార్‌లోని ఆలయంలో అమ్మవారు శాకంబరీ దేవి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 23 లక్షల రూపాయల విలువైన నోట్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నెల్లూరులోని దర్గామిట్టలో రాజరాజేశ్వరీ దేవస్థానంలోని 45వ శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన వారు భజన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చదవండి:వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు