విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి గిరిజనులు ఆందోళన బాట పట్టారు. గ్రామానికి రెండు నెలల నుంచి రేషన్ సరకులు అందటం లేదని, సరైన రోడ్డు లేకపోవటమే ఇందుకు కారణమని.. స్థానికులు తెలిపారు. గిరిజనులు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ మండల కేంద్రానికి చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దారపర్తి గిరిజన పంచాయతీ కొండల మధ్య ఉంటుంది. మండల కేంద్రానికి రావాలంటే సుమారు 20 కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి. ప్రతి నెల గిరిజనులు రేషన్ సరుకుల కోసం 15 కిలోమీటర్లు వచ్చి.. దబ్బగుంట గ్రామంలో సరుకులు తీసుకునేవారు. ఇంటింటికి రేషన్ సరుకులు పథకం పెట్టాక.. గిరిజనులకు ఆ కష్టం తీరిందనుకున్నారు. కానీ, అసలు రేషనే అందటం లేదని వారు వాపోయారు.
శృంగవరపుకోట వద్దనున్న దేవి ఆలయ కూడలిలో రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవటంతో.. కొందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు.. గిరిజనులకు సకారంలో రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: