విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఓ సైబర్ మోసం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తి స్థానిక వార్డు వాలంటీర్కు ఫోన్ చేశాడు.. కలెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ పరిధిలో అందరికీ చేయూత డబ్బులు వచ్చాయా అంటూ ప్రశ్నించాడు. ఇద్దరికి రాలేదని వాలంటీర్ సమాధానం చెప్పడంతో.. దీంతో వాళ్లిద్దరికీ ఫోన్ చేయమని ఆగంతకుడు నమ్మబలికాడు. కేటుగాని మాటలు నమ్మిన వాలంటీర్.. ఓ లబ్ధిదారుడుకి ఫోన్ చేసి ఆగంతుకునితో కాన్ఫరెన్స్లో మాట్లాడించాడు. నేను లబ్ధిదారులతో మాట్లాడుతా.. మీరు ఫోన్ కట్ చేయమని చెప్పడంతో వాలంటీర్ కట్ చేశాడు.
అప్పడు మొదలైంది అసలు కథ.. అగంతకుడు సదరు లబ్ధిదారుడిని మాయమాటలు చెప్పాడు. మీ ఖాతాలో నగదు పడుతుంది.. మీ ఫోన్కు వచ్చే ఓటీపీ చెప్పండి అని నమ్మబలికాడు. కేటుగాని మాటలకు మోసపోయిన అతను ఓటీపీ చెప్పాడు. అలా రెండుసార్లు ఓటీపీ చెప్పగా రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 20 వేలు నగదు డ్రా చేశాడు. ఇది గుర్తించిన సదరు వ్యక్తి.. ఇదేంటని అగంతకుడిని ప్రశ్నించగా.. ముందు అలాగే జరుగుతుంది. తర్వాత మొత్తం నగదు జమ అవుతుందని నమ్మించాడు.
ఇలా మరో రెండుసార్లు ఓటీపీ చెప్పాడు. ఇంకేముంది.. మొత్తంగా రూ. 46 వేలు కాజేశాడు. తరువాత మోసపోయానని గుర్తించిన బాధితుడు.. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై కళాధర్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దని ఎస్సై సూచించారు.
ఇదీ చదవండి..
Visakha steel protest: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోం: మంత్రి అవంతి