* కదిలే కాలంతో పరుగెత్తలేని పండుటాకులు కాలం తెచ్చిన కరోనా కల్లోలానికి బలి కావాల్సి వచ్చింది. వృద్ధాప్యం, అనారోగ్యానికి వైరస్ తోడు కావడంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా 101 మంది వరకు మృత్యువాత పడ్డారు. అందరూ ఉన్నా కరోనా మరణం అనాథ మరణమే. చాలామంది అయిన వాళ్ల కడచూపునకు నోచుకోక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
* లాక్‌డౌన్‌లో రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించి పోవడంతో వృద్ధులు తమ అవసరాలకు బయటకు వెళ్లలేక అవస్థలు పడ్డారు. రోజువారీ మందులు కొనుగోలుకీ ఇబ్బందులు చవిచూశారు. దుకాణాల్లో మందుల కొరత మరింత వేధించింది.
* వృద్ధాప్యంలో కంటి సమస్యలకు సంబంధించిన వైద్య అవసరాలు ఎక్కువగా ఉంటాయి. జిల్లాలో 11 సామాజిక ఆసుపత్రుల్లోని ఐకేర్ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బందిని కొవిడ్ విధులకు పంపడంతో ఆ కేంద్రాలన్నీ సేవలు నిలిపివేశాయి. దీంతో కంటి పరీక్షలు, వైద్య సేవలు అందక అవస్థలు పడ్డారు.
* నాలుగు నెలలు పాటు వృద్ధులు ఇళ్లకే పరిమితం కావడంతో పాటు కరోనా భయంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. కన్న బిడ్డలు దూరంగా ఉన్న వృద్ధులు మరింత మనోవేదన చెందారు.
* ఉపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన కూలీల కుటుంబాల్లో వృద్ధులను మాత్రం కరోనా కలవర పెట్టింది. మక్కువ, బలిజిపేట, బొబ్బిలి, సాలూరు, మెరకముడిదాం మండలాల్లో కూలీలు ఇంట్లో తమ వృద్ధతల్లిదండ్రుల వద్ద పిల్లలను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. లాక్‌డౌన్‌లో వారంతా అక్కడే చిక్కుకుని కొన్నాళ్ల పాటు ఇళ్లకు చేరకపోవడంతో వృద్ధులే చిన్నపిల్లలను కాపాడుకుంటూ వచ్చారు. తమ వారు ఎక్కడున్నారో..ఎలా ఉన్నారో అన్న ఆందోళనతో గడిపారు.
కాస్త ఊరట..
* లాక్‌డౌన్ కాలంలో వృద్ధాశ్రమాలకు అవసరమైన ఆహారాన్ని దాతలు విరివిగా అందించడంతో వారికి ఆసరా లభించింది. కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టేలా ఆశ్రమ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవడంతో చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు. జిల్లాలోని 13 వృద్ధాశ్రమంలోనూ కరోనా దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.
* లాక్‌డౌన్ కారణంగా కుటుంబమంతా కలిసి జీవించడానికి అవకాశం ఏర్పడింది. ఇంట్లోనే ఉండడంతో పిల్లలు వారితో గడిపే సమయం చిక్కింది. తమకు ఎలాంటి కష్టనష్టమొచ్చినా తన వాళ్లు దగ్గరే ఉన్నారన్న భరోసా వృద్ధులకు ఏర్పడింది. కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దోహదపడింది.
* కరోనా కట్టడికి పనిచేసిన పోలీసు శాఖలో 55 ఏళ్లు వయస్సు దాటిన వారిని కరోనా విధుల నుంచి తప్పించడంతో వారికి ఊరటనిచ్చింది.
ఇవీ చదవండి: