రాష్ట్రంలో విజయవాడ తరువాత లారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం సాలూరు. విజయనగరం జిల్లాలోని సాలూరు.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఉండటం..26వ జాతీయ రహదారి ఇదే మార్గంలో వెళ్లటం..లారీ పరిశ్రమ పురోగతికి దోహం చేశాయి. సాలూరులో 2 వేల వరకూ లారీలు ఉండగా... దాదాపు 15 వేల మంది వరకూ పరిశ్రమపై పరోక్షంగా, ప్రత్యేకంగా ఆధారపడ్డారు. చత్తీస్‌గఢ్, ఒడిశాలోని ప్రధాన నగరాల నుంచి... రాష్ట్రంలోని పలు నగరాలకు ఎగుమతులు, దిగుమతులకు ఇక్కడి లారీలే ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమ అభివృద్ధి చెందటంతో..వాటికి అనుబంధంగా చిన్నపరిశ్రమలూ పుట్టుకొచ్చాయి. లారీ బాడీలు తయారీ, రంగుల అద్దకం, మరమ్మతుల కేంద్రాలు పెరిగాయి. కరోనా దెబ్బతో ఇవన్నీ మూతపడటంతో... చాలా మంది ఉపాధి కోల్పోయారు.
కరోనా ఆంక్షలు, పెరిగిన డీజీల్ ధరలు..
గతేడాది లాక్‌డౌన్‌లో పరిస్థితిలోనే చాలా దారుణంగా తయారైందని కోలుకుందామనుకున్న సమయంలోనే రెండో దశ ఆంక్షలు చుట్టుముట్టాయని లారీ యజమానులు వాపోయారు. దీనికితోడు 4 నెలల వ్యవధిలోనే దాదాపు 25 రూపాయల వరకూ డీజిల్ ధరలు పెరగటంతో పరిస్థితి మరింత దిగజారిందని చెబుతున్నారు. నష్టాలతో నడపలేక సుమారు వెయ్యి లారీలు యార్డులకే పరిమితమయ్యాయి. నెలనెలా చెల్లించాల్సిన రుణాల వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. వడ్డీ అంతకంతకూ పెరుగుతోందని వాపోతున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, కార్మికులు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారని..ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించకపోతే పరిస్థితి దారుణంగా తయారవుతుందని లారీ యజమానులు తెలిపారు.
సాధారణ రోజుల్లో నెలకు 5 ట్రిప్‌లు వరకూ గిరాకీ ఉండేది. ఆంక్షలతో 2ట్రిప్‌లు జరగటమే కష్టంగా ఉంటోంది. కొత్త ఆంక్షలతో మధ్యాహ్నం 12లోగా లోడింగ్, అన్‌లోడింగ్ పూర్తిచేయాల్సి ఉంటోంది. సమయానికి వాహనాలు గమ్యానికి చేరుకోకపోతే అదనంగా కూలీల భారం పడుతోంది. ఇవన్నీ భరించలేకే లారీలు అమ్ముకుంటున్నామని యజమానులు చెబుతారు. సాలూరు లారీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. లారీ చక్రాలు కదిలితేగానీ... వీరి బతుకు బండి ముందుకుసాగదు. స్వల్పఆదాయాలు కలిగిన వీరి బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
ఇదీ చదవండి:
CM Jagan Review: భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి