రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడంలో విజయనగరం జిల్లా మెుదటి స్థానంలో ఉంటుందని కలెక్టర్ జవహర్లాల్ అన్నారు. బ్యాంకుల సహకారంతో అమలు చేసే పథకాల్లోనూ.. జిల్లా మొదటి స్థానంలో నిలిచేందుకు వీలుగా బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు సమిష్టి కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాలైన పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వాటికి రుణాలు అందజేయాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వాలని భావిస్తోందన్నారు. జిల్లాలో 34 వేల మందికి సీసీఆర్సీ కార్డులు ఇస్తున్నామని వారందరికీ పంటరుణాలు ఇవ్వాలని కోరారు.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రూ.1861 కోట్ల పంటరుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారని కలెక్టర్ వెల్లడించారు. పాడిపరిశ్రమ రంగంలో జిల్లాకు మంచి భవిష్యత్ ఉందని.. చిత్తూరు తర్వాత పాడిపరిశ్రమలో ఆ స్థాయిలో నిలిచేది విజయనగరం మాత్రమేనని చెప్పారు. ఈ రంగానికి బ్యాంకులు సహకారం అందించి చేయూత పథకం కింద యూనిట్ల మంజూరుకు సహకరించాలన్నారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేసి వచ్చే డీసీసీ సమావేశం నాటికి ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించి జిల్లాను రెండోస్థానంలోకి తీసుకు రావాలని ఆదేశించారు. జిల్లాలోని భారతీయ స్టేట్‌బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి శిక్షణ సంస్థకు ఏ ప్లస్ గ్రేడింగ్ వచ్చిందని... శిక్షణ కేంద్రం ఇంఛార్జి అధికారి వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డీఆర్డీఏ సావిత్రి, బి.సి.కార్పొరేషన్ ఈడీ జి.జగన్నాధరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Cji NV Ramana: రేపు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ