మాయ మాటలతో ఇతరులను బురిడీ కొట్టించి...పబ్బం గడుపుకుంటున్న ఓ మోసగాడిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకి చెందిన అమరాపు రాజేష్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఏ పనీ పాట చేయకుండా ఇతరులను తెలివిగా మోసగిస్తూ పబ్బం గడపడం మొదలు పెట్టాడు. దీనికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.
తన పర్సు, బ్యాగు పోయాయని.. ఊరు వెళ్ళడానికి ఆర్థిక సాయాం చేయాలని ఇటీవల ఒక వ్యక్తిని అభ్యర్థించాడు. ఇతని మాటలను నమ్మి సదరు వ్యక్తి రూ. 500 ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత సదరు వ్యక్తికి ఫోన్ వచ్చింది. మీరు 500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం వల్ల తాను ఎంతో సంతోషిస్తున్నానని, దీనికి సాయంగా ఓ ఐదు లాప్‌టాప్‌లు బహుమతిగా పంపిస్తానని, తనకు పేర్లు పంపించాలంటూ వివరించాడు. నిజమే అనుకొని నమ్మిన సదరు వ్యక్తి పేర్లు పంపించాడు. మరో రెండు రోజుల తర్వాత లాప్‌టాప్‌లు పంపించడానికి రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1100 పంపించాలంటూ మళ్లీ ఫోన్ చేయగా.. సదరు వ్యక్తి ఆ మేరకు డబ్బు అతడు చెప్పిన అకౌంట్‌కి పంపించాడు. అయితే ఆ డబ్బు తనకి అందలేదని, వెయ్యి రూపాయలు పంపించాలంటూ మళ్లీ ఫోన్ చేసాడు. దీనితో మోసాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మాటు వేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆరా తీస్తే... చాలామందిని ఈ విధంగానే మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :