విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని.. తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఆలయాలపై దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతపై మండిపడ్డారు. మనుషులకే కాకుండా దేవాలయాలు, విగ్రహాలకూ భద్రత కొరవడటం.. పాలకుల చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. 4 శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం.. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణన్నారు. దేవాలయాలపై వరుస దాడులు, విధ్వంసాలు అనేకం జరుగుతున్నా.. సీఎం జగన్ చోద్యం చూడటం గర్హనీయమన్నారు.
19 నెలల పాలనలో 120 పైగా ప్రాంతాల్లో ఆలయాలపై దాడులు, విధ్వంసం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పథకం ప్రకారమే రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాల ధ్వంసం, గుంటూరులో దుర్గమ్మ ఆలయం కూల్చివేత, సింహాద్రి అప్పన్న గుడిలో, తితిదేలో, శ్రీశైలంలో, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అన్యమత ప్రచారాల ద్వారా ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాక.. కులాలు, మతాల వారీగా చిచ్చుపెట్టి ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అంతర్వేది, బిట్రగుంట దేవాలయాల్లో రథాలకు నిప్పు పెట్టినప్పుడే కఠిన చర్యలు చేపట్టివుంటే.. ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావని తెలిపారు. రామతీర్థం ఘటనలో నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: