విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలోని బయోరిసోర్స్ కంపెనీలో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులకు పట్టుకున్నారు. విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్ సోమవారం విజయనగరం సబ్ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ముక్కాం గ్రామంలో వైశాఖి బయో రిసోర్స్‌లో రొయ్య, చేపలకు సంబంధించిన ఆహారం తయారవుతుంటుంది. కంపెనీలో సరుకు చోరీ అవుతున్నట్లు గత నెల 28న యాజమాన్య ప్రతినిధులు భోగాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికి 363 ఫీడ్ టిన్‌లు చోరీ అయ్యాయని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన సీఐ శ్రీధర్, ఎస్‌ఐ మహేష్, సిబ్బంది కంపెనీ వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించారు. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల కదలికలను నిశితంగా పరిశీలించారు. అనుమానం కలిగి సీల రాము, సీల పైడిరాజు, దేబార్కి రాజారావులను స్టేషన్‌కు పిలిపించి లోతుగా ఆరా తీశారు. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి దొంగతనానికి పాల్పడినట్లు వారు అంగీకరించారు. కాగితాల రామునాయుడు, గాబు అప్పలరెడ్డిల సాయంతో కాకినాడలో చేపల ఆహారాన్ని అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. కాకినాడలో వీరి వద్దనుంచి కె.శ్రీను, పి.నాగబాబు, పి.శ్రీనులు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ప్రస్తుతానికి రూ.4 లక్షల 47 వేలు, ఐదు సెల్‌ఫోన్లతో పాటు మూడు ఫీడ్ టీన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాల నేరస్తుడు ఒకరు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కాకినాడలో కొనుగోలు చేసిన వారిని కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తంగా ఆరుగురిని ఆదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: Mansas Trust: ఆడిట్ విషయంలో మాన్సాస్ ట్రస్టు, అధికారుల మధ్య వివాదం