తెదేపా తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి వైకాపాకు అనుబంధంగా కొనసాగుతామంటూ వలస వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వారి నియోజకవర్గాల్లో సెగ పెరిగింది. వారి పరిస్థితి ఉండలేక, వెళ్లలేక అన్నట్లుగా ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి మద్దతు లభిస్తుందనుకున్న వారికి ఆశాభంగం తప్పడం లేదు. ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి శనివారం వైదొలిగారు.
అప్పట్లో గణేష్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వైకాపాకు మద్దతు ప్రకటించాక ఆయనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లను కూడా ఆయన గెలిపించుకున్నారు.
‘నామినేటెడ్ పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పచెప్పడేమిటి’ అని శ్రీవాత్సవ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి, శ్రీవాత్సవలు ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు.
మరో పక్క పార్టీ నేత సుధాకర్‌ను బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నిమమించారు. విశాఖ దక్షిణలో కార్యకలాపాలు చేపట్టేందుకు వైకాపా అధినాయకత్వ ప్రతినిధి ఒకరు ఆయనను ప్రోత్సహించారు. శ్రీవాత్సవ కొంత నిదానించడంతో నలుగురు కార్పొరేటర్లతో కలిసి సుధాకర్ కార్యకలాపాలు ముమ్మరం చేశారు. సహజంగా అసమ్మతి స్వరాలు వినపడడానికి అవకాశం ఏర్పడింది. వాసుపల్లిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారు. అధినాయకత్వం నుంచి ఆయనకు మద్దతు కొరవడిందన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో వాసుపల్లి బాధ్యతల నుంచి వైదొలిగారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గన్నవరంలో గరంగరంగానే.. వైకాపాకు మద్దతు తెలిపిన మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో తొలి నుంచి వైకాపా నేతలతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు.
ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రే కలగజేసుకుని సర్దుబాటు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇటీవల వెంకట్రావు కొద్దిగా నెమ్మదించారు. దుట్టా మాత్రం ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేదే లేదని అధినాయకత్వానికే తేల్చి చెప్పేశారు. దుట్టా అల్లుడు శివభారతరెడ్డితోనూ వంశీకి తరచూ వివాదాలు తప్పడం లేదు.
చీరాల కరణంకు ఉంటుందా?.. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపాకు మద్దతు ప్రకటించారు. ఆయన కొడుకు వెంకటేష్ నియోజకవర్గంలో వైకాపా తరపున పనిచేసుకుంటున్నారు. మరోపక్క అదే నియోజకవర్గం నుంచి 2019లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ పోటీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అధినాయకత్వం పలుమార్లు చర్చలు జరిపి ఆయనను పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇటీవల ముఖ్యమంత్రి ఆమంచిని పిలిపించి మాట్లాడి పర్చూరుకు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.
చీరాలలో కరణంకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే తాను గెలిపిస్తానని ఆమంచి సీఎంకు చెప్పారు. ఆ మరుసటి రోజే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్‌ను కలిసి కరణంనే చీరాలలో పోటీ చేయించాలని చెప్పడం గమనార్హం. సీఎం జగన్ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. అలాగే వెంకటేష్‌ను అద్దంకికి పంపుతారన్న చర్చ సాగింది.
కరణం బలరాం మాత్రం చీరాల నుంచే తన కొడుకును బరిలోకి దించాలని స్థిర నిర్ణయంతో ఉన్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో పోతుల సునీత చీరాల టికెట్ ఆశించడం గమనార్హం. దాంతో ఇక్కడ టికెట్టు కోసం త్రిముఖ పోటీ అనివార్యమైంది.
గుంటూరు పశ్చిమలో చాపకింద నీరులా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాపకింద నీరులా ఎమ్మెల్యేకి వైకాపా నేతల నుంచి సెగ తగులుతోందన్న భావన వ్యక్తమవుతోంది.
2019లో ఆయనపైన వైకాపా తరపున పోటీ చేసిన ఏసురత్నమే ఇప్పటికీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండడం, అధికార పార్టీ కీలక పదవిలో ఉన్న మరో నేత ప్రభావం ఇక్కడ ఉండడంతో ఎమ్మెల్యేకి అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. ఇటీవల గడప గడపకి కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను తెలిపేలా ఏసురత్నం అనుచరులు ప్లకార్డులు పట్టుకుని తిరగడాన్ని తొలుత ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు నివారించారు. ఆ తర్వాత నుంచి ఏసురత్నం గడప గడప కార్యక్రమానికీ దూరంగా ఉంటున్నారు.
సమన్వయకర్త పదవికి వాసుపల్లి రాజీనామా.. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపాలో విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. సమన్వయకర్త పదవికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ రాజీనామా చేస్తూ, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి శనివారం లేఖ రాశారు.
లేఖ ప్రతిని జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పంపారు. ‘దక్షిణ’ సమన్వయకర్తగా వాసుపల్లి ఉంటారని జిల్లా సమన్వయకర్త సుబ్బారెడ్డి ఇటీవల ప్రకటించాక కూడా కొందరు నాయకులు ఆయనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో వాసుపల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేఖలో వాసుపల్లి ప్రస్తావించిన అంశాలివి.. ‘2014లో మత్స్యకారుల్లోని వాడబలిజ సామాజికవర్గం నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందా. 2019లో జగన్ హవాలోనూ తెదేపా తరఫున గెలిచి, జగన్ పాలన నచ్చి వైకాపాకు మద్దతిస్తున్నా. ప్రాంతీయ సమన్వయకర్త హోదాలో మీరు తొలిసారి విశాఖ వచ్చినరోజే నాకు శల్యపరీక్ష పెట్టడం, బలనిరూపణ చేసుకోవాల్సి రావడం నా గౌరవానికి భంగం కలిగించాయి. నాటి పంచాయితీకి చింతిస్తున్నా. పూర్వాపరాలు అర్థం చేసుకొని వ్యక్తిగత కారణాలతో సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నా. మీ నిర్ణయానికి కట్టుబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా’నని వాసుపల్లి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: