YSRCP Leaders Changing VMRDA Master Plan: రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలను భారీగా విస్తరిస్తున్నారు. ప్రజలు నివసించేందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం ఆయా నగరాల్లో ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌లను సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగానే ప్రతిఒక్కరూ నడుచుకోవాలి. కానీ అధికారపార్టీ నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఈ మాస్టర్‌ప్లాన్‌కు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో మాస్టర్ ప్లాన్‌లో ఇష్టానుసారంగా సవరణలు చేయిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తుందని ప్రతిపాదిత రోడ్లను సైతం రద్దు చేయించుకుంటున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రజా ప్రయోజనాల కంటే అధికారపార్టీ నేతల సేవే పరమావధిగా వీరు వ్యవహరిస్తున్నారు.
రెండేళ్ల క్రితం ఆమోదించిన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) (Visakhapatnam Metropolitan Region Development Authority)కొత్త మాస్టర్ ప్లాన్‌లో ఎప్పటికప్పుడు చేస్తున్న సవరణలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌లో సవరణలు చేయాలంటే అదో పెద్ద ప్రక్రియ. అయితే అధికార పార్టీ నేతలకు ఇవేవీ పెద్ద కష్టం కావడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి అధికారుల సహకారంలో ఎప్పటికప్పుడు సవరణలు చేయించుకుటున్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోకుండా సవరణలు చేసేస్తుంది.
అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు.. ఆర్-5 జోన్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్
విశాఖలోని ఎండాడలో మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డుని 60 అడుగులుకి కుదించారు. ఈ రోడ్డులో వైసీపీ నేత ఒకరు భారీ హౌసింగ్ ప్రాజెక్టుని ప్రతిపాదించారు. 80 అడుగుల రోడ్డుతో ప్రాజెక్టులో కొంత స్థలాన్ని కోల్పోనున్నారు. ఆర్థికంగా నష్టమని భావించిన ఆయన ప్రతిపాదిత రోడ్డుని 60 అడుగులకు కుదించేలా ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. భవిష్యత్తులో ఈ రహదారిలో వాహనాల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డుని మాస్టర్ ప్లాన్‌లో ఉంచాలని ప్రజలు కోరినప్పటికీ ప్రభుత్వం సవరణలు చేసేసింది.
అధికార పార్టీ నేతకు చెందిన ఒక లే అవుట్‌కు అడ్డొస్తోందని భీమునిపట్నం మండలం దాకమర్రిలో వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో (VMRDA Master Plan) ప్రతిపాదిత 60 అడుగుల రోడ్డుని రద్దు చేశారు. ప్రజల భవిష్యత్తు అవసరాల మేరకు రోడ్డుని వీఎంఆర్డీఏ ప్రతిపాదించింది. రోడ్డు కారణంగా తన లేఅవుట్‌లోని ప్లాట్లకు నష్టం ఏర్పడుతుందన్న వేంకటేశ్వర డెవలపర్స్ మేనేజింగ్ భాగస్వామి, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కేకే రాజు విజ్ఞప్తిపై ప్రభుత్వ స్థాయిలో ఆగమేఘాలపై దస్త్రాలు కదిలాయి. రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి కూడా ఒకరు ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించి మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదిత రోడ్డు రద్దు చేయించారు.
New Master Plan for Durga Temple: దుర్గగుడికి కొత్త మాస్టర్ ప్లాన్.. పాతది గ్రాఫిక్స్‌కే పరిమితం..!
విశాఖలోని ఎండాడ రెవెన్యూ విలేజ్‌లో బీచ్ రోడ్డు నుంచి వై-జంక్షన్‌ను కలిపే 80 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒకరి విజ్ఞప్తిపై ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సర్వే నంబరు 98, 100, 101, 102, 103లో వెళ్లేలా మాస్టర్ ప్లాన్‌లో రోడ్డును ప్రతిపాదించారు. అందులో తనకు చెందిన విలువైన స్థలం పోతుందని గమనించిన ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి చక్రం తిప్పారు. దీనికి అధికారులు సహకరించడంతో మాస్టర్ ప్లాన్ నుంచి రహదారిని ఇటీవలే తొలగించారు.