YSRCP Government Neglect on Visakha Metro Rail Project : దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఇంత వరకు మెట్రో రైళ్లు లేవు. అందుకే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మెట్రోరైళ్ల అవసరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి.. విశాఖ, విజయవాడల్లో ప్రతిపాదించింది. వాటి సాకారానికి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2014లోనే విశాఖ మెట్రో రైలుకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
రాష్ట్ర DPR (Detailed Project Report) కు 2014 జూన్ 27నే కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 8 వేల300 కోట్ల అంచనా వ్యయంతో 42.55 కిలో మీటర్ల పొడవునా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం తలపెట్టింది. కేంద్రం ప్రభుత్వ సూచనతో PPP (Public-Private Partnership) విధానంలో చేపట్టాలని నిర్ణయించి.. టెండర్లు పిలిచింది. కానీ టెండర్లను, డీపీఆర్‌ను వైఎస్సార్సీపీ సర్కార్ రద్దు చేసేసింది.
Vizag Metro: విశాఖ మెట్రోకు మంగళం పాడిన జగన్.. నాలుగేళ్లుగా మాటలకే పరిమితం
CM Jagan Careless on Metro Train in AP : గత ప్రభుత్వ ప్రతిపాదనలు కాదని అనకాపల్లి నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) వరకు జాతీయ రహదారి వెంబడి 140.13 కిలో మీటర్ల పొడువునా మెట్రోరైల్ కారిడార్ల నిర్మాణం చేడతామని.. జగన్ ప్రభుత్వం ప్రకటించింది. 2019 డిసెంబరులో పురపాలక శాఖ మంత్రి హోదాలో మంత్రి బొత్స.. ప్రతిపాదిత కారిడార్ల పరిశీలన పేరుతో హడావుడి చేశారు. అంతే మళ్లీ చప్పుడు లేదు. పురోగతి ఏదైనా ఉందంటే.. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ మెట్రోరైల్ కార్పొరేషన్‌గా మార్చడం ఒకటే. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం మాత్రమే.
విశాఖ, శివారు ప్రాంతాల జనాభా ప్రస్తుతం 30 లక్షలకుపైనే ఉంది. 2 ఓడరేవులు, విశాఖ ఉక్కు సహా అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు, పరిశ్రమలకు విశాఖ కేంద్రం. దేశంలోనే పది ధనిక నగరాల జాబితాలోనూ ఉంది. అలాంటి విశాఖకు మెట్రో రైలు వస్తే.. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై శ్రద్ధచూపని జగన్ ప్రభుత్వం విశాఖ మెట్రోపైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
ఏపీకి మెట్రో అందని ద్రాక్షగానే మిగిలిపోనుందా..?
Vizag Metro Project Status : విశాఖలో గత దసరా నాడు మెట్రో రైలు కార్యాలయం ప్రారంభించినా ఇప్పటివరకు అతీగతీ లేదు. పరిస్థితి ఇలా ఉంటే విశాఖను ఉద్ధరించేస్తామంటూ అక్కడికే మకాం మారుస్తున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించారు. అందుకోసం రుషికొండను బోడిగుండు (Rushikonda )చేసి వందల కోట్లు ఖర్చుచేసి నిర్మాణాలు సైతం చేశారు. కానీ విశాఖ మెట్రో కోసం ఒక్క అడుగూ వేయలేదు.
విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ఏర్పాటుపై విభజన చట్టంలో చెప్పినా వైఎస్సార్సీపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. 46.42 కిలోమీటర్ల మొదటి దశను 2020-24 మధ్య, 77.31 కిలోమీటర్ల రెండో దశను 2023-28 మధ్య, 16.40 కిలోమీటర్ల మూడో దశను 2027-29కి పూర్తి చేస్తామని మూడున్నరేళ్ల క్రితం మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఎలాంటి కదలికా లేదు.