సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామానికి చెందిన ఎల్లాజీనాయుడు(33) విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. గతనెల 30(బుధవారం)న తాను పనిచేసే కంపెనీ ద్వారా సీతమ్మధారలోని ఓ ఆసుపత్రిలో కొవిడ్ టీకా తీసుకున్నారు. కాసేపటికే ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో సహోద్యోగి అన్నంరెడ్డి కృష్ణ ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఆ రోజు రాత్రి వాంతులు విరోచనాలు అయి గురువారం ఉదయం ఎల్లాజీ స్పృహ కోల్పోయాడు. వెంటనే108 అంబులెన్సులో విశాఖపట్నం తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శవపరీక్ష కోసం మృతదేహాన్ని అనకాపల్లి తీసుకెళ్లగా అక్కడ వ్యాక్సినేషన్‌ను నిర్ధారించే నిపుణులు లేకపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు.
కొవిడ్ టీకా వికటించడం వల్లనే తన భర్త మృతి చెందాడని భార్య ఫిర్యాదు చేసిందని.. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. మృతునికి భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఎల్లాజీ మరణంతో ఆయన కుటుంబం వీధిన పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం అతని సోదరుడి వివాహాన్ని గ్రామంలో వైభవంగా నిర్వహించారని పెళ్లిలో ఎల్లాజీ కలివిడిగా తిరిగాడని గ్రామస్థులు చెప్పారు. పందిరికి కట్టిన తోరణాలు వాడకముందే పెళ్లింట ఈ ప్రమాదంతో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇది చదవండి:
JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్ లేఖలు