YCP Leaders Focus on Visakha Lands: విశాఖలో భూముల కొనుగోలు వ్యవహారం అంటే.. వ్యాపారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆక్రమణలు పెరిగాయన్న భయంతోపాటు.. అధిక విస్తీర్ణం కలిగిన స్థలాలపై కన్నేస్తున్నారన్న ఆందోళన నెలకొంది. వైసీపీకు చెందిన కీలక నేతలు ఇప్పటికే భీమిలి, మధురవాడ ప్రాంతాల్లో బలవంతంగా భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. చిన్నపాటి వివాదాలున్నా వాటిల్లో కావాలనే జోక్యం చేసుకుని భూముల్ని హస్తగతం చేసుకుంటారని.. భయపెట్టి.., బెదిరింపులకు దిగి కాజేస్తారన్న ఆందోళన లేకపోలేదు.
అసలు వివాదాలే లేని చోట్ల కొత్తవి సృష్టించి మరీ వాటాలు కోరుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. అందుకే విశాఖలో భూముల కొనుగోలు అంటేనే వెనుకడుగేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డవారు అసలు ఆసక్తే చూపడం లేదు. తెలుగుదేశం హయాంలో అధిక సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు స్థలాల కొనుగోలుకు మక్కువ చూపేవారు. ఇప్పుడు స్థలాలు ఉన్నాయా అని అడిగేవారే లేరు. కోట్ల రూపాయలు పెట్టి స్థలాలు కొనుగోలు చేసినా వాటిని కాపాడుకోలేమన్న భావన పలువురు వ్యాపారుల్లో నెలకొంది.
విశాఖలో ఎవరూ భూములు కొనుగోలు చేయొద్దని.., ప్రభుత్వం మారితే వివాదాస్పద ప్రాంతాల్లో అమ్మకాలన్నీ రద్దు చేస్తామనే ప్రతిపక్షాల హెచ్చరికల నేపథ్యంలో.. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ఎక్కువ మంది ధైర్యం చేయడం లేదు. మధురవాడలో గతంలో వీఎమ్ఆర్డీఏ ఒక సంస్థకు విక్రయించిన 87 ఎకరాలను, ఆ సంస్థ వద్దనుకోవడంతో ఒప్పందం రద్దయింది. దీంతో మళ్లీ ఆ భూములను విక్రయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
అమ్మకానికి వీలుగా ఆ ప్రాంతం చుట్టూ ప్రహరీ నిర్మించి రోడ్లు వేశారు. ఏకమొత్తంగా అమ్మేందుకు ప్రకటన ఇవ్వగా.. ఎవరూ రాలేదు. ఆ తర్వాత మధురవాడ హైట్స్ పేరుతో ఆ మొత్తాన్ని 14 ప్లాట్లుగా విభజించి తాజాగా విక్రయానికి పెట్టారు. ఆ స్థలాల ప్రాధాన్యతను వివరిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. గత నెల 27తో బిడ్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ ఒక్కరూ స్పందించలేదని తెలిసింది. బహిరంగ మార్కెట్‌లో అక్కడ చదరపు గజం 50 వేల రూపాయల వరకు ఉన్నప్పటికీ.. 30 వేలకే విక్రయానికి పెట్టినా స్పందన కరవైంది. 14 ప్లాట్లను అమ్మడం ద్వారా 15 వందల కోట్ల రూపాయల వరకు వస్తుందనుకుంటే.. అంచనాలు తప్పాయి.
‘దసపల్లా’పై అత్యుత్సాహం!.. 22(ఎ) నుంచి తొలగించేందుకు వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు
గతేడాది రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ రుషికొండ నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలోని ఎండాడ పరిధిలో 50 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. 800 కోట్ల రూపాయల వరకు వచ్చేలా ప్రణాళిక రూపొందించి పలుమార్లు జాతీయ స్థాయిలో బిడ్లు పిలిచినా ఫలితం లేకుండాపోయింది. అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాలలో.. మార్కెట్ విలువ దాదాపు 30 కోట్లు ఉన్న.. 10 ఎకరాలు, పరవాడ మండలం ఇ-బోనంగిలో మార్కెట్ విలువ 33 కోట్ల రూపాయలు ఉన్న 4.27 ఎకరాలకు 6 దఫాలు ప్రకటనలు ఇచ్చినా ఎవరూ కొనలేదు.
భీమిలి పరిధిలోని చిట్టివలసలో 3.56 ఎకరాలు, కాపులుప్పాడలో 1.50 ఎకరాలదీ అదే పరిస్థితి. మధురవాడ పరిధిలో తాజాగా 7 చోట్ల సుమారు వంద కోట్ల రూపాయలు విలువ చేసే బల్క్ ల్యాండ్స్‌ను విక్రయానికి వీఎమ్ఆర్డీఏ సిద్ధం చేసింది. బీచ్ రోడ్డులో గతంలో 'లులు'కు కేటాయించిన ఏపీఐఐసీకి చెందిన 13 ఎకరాల స్థలాన్ని ఇటీవల వీఎమ్ఆర్డీఏ ప్రభుత్వం బదలాయించింది. దీన్ని విక్రయించేందుకు నిర్ణయించారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ లేఅవుట్‌లో అడుగడుగునా అక్రమాలు : తెదేపా నేత పల్లా