విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని మర్లగుమ్మి ఆనకట్ట మరమ్మతు పనులను ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు పరిశీలించారు. ఆనకట్టకు పెద్ద ఎత్తున గండి పడి సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సంబంధిత ఈఈ, అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మర్లగుమ్మి ఆనకట్ట ఇలా మారడానికి అధికారుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. మర్లగుమ్మి ఆనకట్టకు మరమ్మతులు చేపట్టి రానున్న ఖరీఫ్ పంటకు సక్రమంగా ఆయకట్టుకు సాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. లేదంటే ఇది జనవనరుల శాఖ అధికారుల వైఫల్యంగానే భావించి రైతులతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
2019లో ఆనకట్టకు పడిన గండి మరమ్మతులకు నిధులకు ప్రతిపాదన పంపించారని, తరవాత వచ్చిన వర్షాలకు గండి మరింత పెద్దదైనా.. కనీసం పరిశీలించి, మళ్లీ అదనపు నిధులకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని మండిపడ్డారు. నాలుగువేల ఎకరాలకు పైగా రైతులు ఇబ్బంది పడుతుంటే.. ఇప్పటి వరకు ఏమి చేశారని ప్రశ్నించారు. జలవనరుల శాఖలో సమస్యలను.. శాసన సభ్యుడైన తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు.
సమస్య వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేసేవారమన్నారు. అధికారుల తీరుపై సీఎం, జలవనరులశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాలువల్లో పూడిక తీయించాలని సూచించారు. డీఈఈ ఉషారాణి, ఏఈ జయరామ్, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: