విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి మంగళవారం ఆయకట్టులో వరినాట్లు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు అనుకూలించడంతో జలాశయం ఆయకట్టులో నారుమళ్లు ఏపుగా పెరిగి, నాట్లకు సిద్ధంగా ఉన్నాయి. రైతుల విజ్ఞప్తి మేరకు స్థానిక ఎమ్మెల్యే జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడి, సాగునీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం రైవాడ జలాశయం ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 112.5 మీటర్లు నీటిమట్టం ఉంది. వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి అదనపు నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. ఖరీఫ్ పంటలకు సాగునీటికి డోకా ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు విడుదల చేయనున్న నేపథ్యంలో రైతులు వరినాట్లకు ఎంతో ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి