భారతీయ రైల్వేలో 2020 - 21 సంవత్సరానికి అధిక ఆదాయం సాధించిన డివిజన్లలో వాల్తేర్‌కు 5వ స్థానం సాధించింది. అధిక లోడింగ్ చేసిన డివిజన్లలో 6వ స్థానంలో నిలిచినట్లు వాల్తేర్ డీఆర్‌ఎం చేతన్‌కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. కొవిడ్-19 సవాళ్లు ఉన్నప్పటికీ.. 2019-20 కంటే రూ.811.61 కోట్లు అధికంగా గడించి 7.71 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. లాక్డౌన్ వాల్తేర్ డివిజన్ రోజుకు సుమారు 2750 వ్యాగన్లతో దాదాపు 61.13 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసి రూ.7272.88 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి రోజున 81 రైళ్ల లోడింగ్ చేసినట్లు తెలిపారు.
కరోనా సమయంలో ఇంతటి లక్ష్యాలు చేరడానికి కృషి చేసిన వారిని అభినందించేందుకు ‘సెల్యూటింగ్ స్టాఫ్’ పేరిట గురువారం రాత్రి విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో వాల్తేర్ డీఆర్‌ఎం చేతన్‌కుమార్ పాల్గొన్నారు. సిబ్బందిని అభినందిస్తూ మెమొంటో అందజేశారు. సరకు రవాణాను ఆకర్షణీయంగా మార్చడానికి రైల్వే పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. తూర్పు కోస్తా రైల్వే 204.88 మిలియన్ టన్నులతో భారతీయ రైల్వేలో అత్యధిక లోడింగ్ జోన్‌లలో ఒకటిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజన్ ఆపరేషన్స్ మేనేజర్ కేవీఎస్‌ఆర్‌కే కిషోర్, ఏడీఆర్‌ఎం అక్షయ సక్సేనా, సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నిధుల కేటాయింపులో జాప్యం.. గమ్యం చేరని రైలు