ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కొత్తగా గ్రామ/ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ చొప్పున నియమించి వీరికి నెలకి రూ. 5000 గౌరవ వేతనం నిర్ధారించారు ఈ విధంగా వేలాది మంది యువతీ యువకులకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం ఒక్కసారిగా వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఫలితంగా వాలంటీరు ఉద్యోగం మూడునాళ్ల ముచ్చటగా మారింది. 35 సంవత్సరాలు దాటితే ఉద్యోగం పోయినట్టే అని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. గత ఏడాది ఆగస్టు నెలలో వాలంటీర్ల నియామకం చేపట్టారు అక్టోబరు 2 వ తేదీన గాంధీ జయంతి రోజున ఈ వ్యవస్థ పని చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు రూపకల్పన చేశారు.
18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న యువతీ యువకులు వాలంటీర్లుగా నియమితులై ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున సేవలను నిర్దేశించింది. వీరికి నెలకి ఐదు వేల రూపాయల గౌరవ వేతనంగా నిర్ధారణ చేశారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాకు సంబంధించి 12285 మంది గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అధికార పార్టీ సానుభూతిపరులు ఉన్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా వాలంటీర్లు 35 సంవత్సరాలు వయసు దాటితే ఉద్యోగం పోయినట్టేనని స్పష్టమవుతోంది. సాధారణంగా గా ప్రైవేటు శాఖల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థకు కూడా అదే నిబంధన గుర్తించాలని ...కానీ వయోపరిమితిని 35 ఏళ్లకే పరిమితం చేశారని వారు వాపోయారు.
డిసెంబరు నెలతో ఓ వ్యక్తికి 35సంవత్సరాలు నిండితే ఈ నెలాఖరు తర్వాత విధుల నుంచి తప్పు కోవలసిందే. సదరు వాలంటీర్‌కి వచ్చే జనవరి నుంచి ఎటువంటి గౌరవ వేతనం అందదు గత ఏడాది విధుల్లో చేరిన పలువురు వాలంటీర్లకు 35 ఏళ్లు దాటడంతో ఈనెల గౌరవ వేతనం నిలిచిపోయింది . దీంతో పలువురు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ముందస్తు నోటీసు ఏమీ ఇవ్వబోమని అధికారులు అన్నారన్నారు. ఈ నెలలో 35 ఏళ్లు పూర్తయితే ఈ నెల నుంచి విధుల్లోకి రానవసరం లేదని పేర్కొన్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వాలంటీర్ వ్యవస్థ పెదవి విరుస్తోంది. మధ్యస్థంగా 35 ఏళ్లకే తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి. 'పల్నాడు' ప్రాజెక్టుకు రుణాన్వేషణ..రూ.2,750కోట్లు ఇచ్చేందుకు ఆర్ఈసీ ఆంగీకారం!