విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద హైకోర్టులో వ్యాజ్యానికి కేంద్రం వేసిన అఫిడవిట్‌ను వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి భారీ నిరసన చేసింది. స్టీల్ ప్లాంట్‌కు జనరల్ షిఫ్ట్‌కు వెళ్లే కార్మికుల బస్సులను అడ్డగించి నిరసన తెలియజేశారు.
కేంద్రం.. అఫిడవిట్‌లోని అంశాలను వెనక్కి తీసుకోవాలని, అబద్ధపు అఫిడవిట్‌ను అంగీకరించమని కార్మిక నేతలు చెప్పారు. పార్లమెంటులో సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నట్టు చెప్తున్న కేంద్రమంత్రుల మాటలు పై కార్మిక సంఘాలు ఆగ్రహించాయి.
వచ్చే నెల 2వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు కార్మిక లోకం కదిలి వస్తోందని, దిల్లీ వీధుల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యమ సత్తా చాటుతామని కార్మిక సంఘం నేతలు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నినాదాలు చేసి... తమ నిరసన తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు నిరసనలో పాల్గొన్నారు. అడ్మిన్ బిల్డింగ్ వద్ద జరిగిన ఈ నిరసనకు అటు సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలు.. విశాఖ న్యూ పోర్ట్ పోలీసులు పహారా కాశారు.
పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావన చేస్తానని చెప్పి అధికార వైకాపా ఎంపీలు మౌనంగా కూర్చున్నారని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని పక్కన పెట్టడం కోసం మరో రెండు అంశాలను తెర మీదకు తెచ్చి నాటకాలు ఆడుతున్నారని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల నిర్వాసితులు నష్టం జరుగుతుందని నిర్వాసితులకు అండగా నిలబడాలని నిర్వాసిత ప్రాంతాలలో పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. ఏకకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని అన్నారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కుపై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు'