ఆర్.ఆర్ వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు యల్లపు అశ్విన్ కుమార్ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అశ్విన్ గురువారం గ్యాస్ లీక్ అవ్వడాన్ని గమనించి తన చుట్టూ ఉన్న సుమారు ఏడు కుటుంబాలను అప్రమత్తం చేశాడు. వారందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించటంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రమాదంలో తాను కూడా తీవ్ర అస్వస్థతకు గురై బావి దగ్గర పడిపోయాడు.
ఆ విషాదం అతని మాటల్లోనే...
నాన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు స్టైరీన్ గ్యాస్ లీకైనట్లు గుర్తించి ఎల్జీ పాలిమర్స్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఫోన్ చేశా. ఫోన్ ఎత్తిన భద్రతాధికారి ఏమీ మాట్లాడకుండా పెట్టేశారు. గ్యాస్ తీవ్రత పెరగటంతో మా కుటుంబంలోని నలుగుర్ని నిద్రలేపి మరో చోటుకు వెళ్లాలని చెప్పా. మా ఇంటిని ఆనుకొని ఉన్న 7 ఇళ్లలో ఉన్న సుమారు 25 మందిని అప్రమత్తం చేసి బయటకు పంపా. కొంత మందిని వెంకటాపురం రైల్వే ట్రాక్ దాటించా. ఆ సమయంలో అస్వస్థతకు గురయ్యా. ప్రాణాలు పోయాయనుకున్నా. నాతో పాటు మా కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఐదు రోజులు అవుతున్నా ఆరోగ్యం కుదుట పడలేదు. ఇంకా వికారంగా ఉంది. ఏమి తిన్నా వాంతి వచ్చేలా ఉంటుంది. అయినా నన్ను డిశ్చార్జ్ చేస్తానంటున్నారు. ఇంటికి వెళ్లిన తరువాత ఏమన్నా అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. నాకు న్యాయం కావాలి.
-అశ్విన్ కుమార్, ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామస్థుడు
ఇదీ చదవండి: విషవాయువు కమ్మేసింది.. గుండెల్ని మెలిపెడుతోంది