Vishakapatnam Bus Shelter Collapsed విశాఖ మహానగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నిర్మించిన బస్ షెల్టర్ కూలిపోయిన ఘటనలో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలకు కూల్చడమే తప్ప కట్టడం రాదని.. బస్ షెల్టర్ కట్టలేని వారు, పోలవరం ఎలా కడతారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాగేనా విశాఖలో పరిపాలనా రాజధాని నిర్మిస్తారు అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బస్ షెల్టర్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పింది. పట్టుమని నెల రోజులు కాకుండానే ఆధునిక బస్ షెల్టర్ కూలడంతో బస్ షెల్టర్ల నిర్మాణంలో నాసిరకాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్ ఫొటో, నవరత్నాల లోగోలను బస్ షెల్టర్లపై వేసి ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప.. పనుల్లో నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఘటనతో ఈ విషయం తేటతెల్లమైంది.
తగరపువలస, భీమిలి వెళ్లే బస్సులతో ఈ బస్ షెల్టర్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చుట్టుపక్కల కాలేజీలు, పాఠశాలలుండటంతో విద్యార్థులతో కిక్కిరిసిపోతుంది. మహానగరపాలక సంస్థ 7 కోట్ల రూపాయలతో విశాఖలో ఇదే తరహా 26 బస్ షెల్టర్లు నిర్మించింది. అందులో జీవీఎంసీ కార్యాలయం ముందు ఉన్న బస్ షెల్టర్ కూలిపోవడంతో.. మిగిలిన నిర్మాణాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన బస్ షెల్టర్ నెలలు తిరగకుండానే కూలడంపై.. ప్రజా సంఘాలు, నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు లేని సమయంలో ఒరిగిన కారణంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.. అదే ప్రయాణికులు ఉన్న సమయంలో జరిగి ఉంటే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద టీడీపీ, సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బస్ షెల్టర్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని.. వీటిని కూడా నవరత్నాల ప్రచారం కోసం వాడుకుంటున్నారని జనసేన నేతలు మూర్తి యాదవ్ మండిపడ్డారు.
ఏడాది కాకముందే పెచ్చులూడుతున్నాయి.. ఆందోళనలో తల్లిదండ్రులు
నగరంలో రోడ్లు వేయమని అడిగితే కార్పొరేటర్లకు నిధులు ఇవ్వడం లేదని కానీ ఈ బస్సు షెల్టర్ పేరు చెప్పి ఏబై లక్షలలో.. పది లక్షల రూపాయల ఖర్చు చేసి నలబై లక్షలు నొక్కేశారని సీపీఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ గంగారాం ఆరోపించారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
టీడీపీ విశాఖ దక్షిణ నియోజక వర్గ ఇంచార్జి గండి బాబ్జి.. కూలిన బస్సు షెల్టర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ విశాఖలో అరాచకానికి ఈ బస్ షెల్టర్ నిర్మాణాలే ఒక నిదర్శనం అని అన్నారు. కమిషన్ల కోసం నాసిరకం పనులు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయాలని.. మేయర్, కమిషనర్ సమాధానం చెప్పాలని కోరారు.
నాసిరకం పనులతో.. వర్షం వస్తేనే జగనన్న కాలనీలు కూలిపోతాయా..?