విశాలమైన రహదారులు.. నిరంతర విద్యుత్ సరఫరా.. స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం.. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రజావేదిక.. ఇలా అన్ని మౌలిక సదుపాయాలతో.. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని తానాం పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజా పన్నులే కాకుండా సొంత నిధులతో నిరంతర ఆదాయం ఉండాలని.. రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించారు. గ్రామంలో ఉండే నిరుద్యోగులకు ఆ దుకాణాలు ఇస్తారు. వాటిపై వచ్చే అద్దె పంచాయతీకి నిరంతర ఆదాయం. 40ఏళ్లుగా పైలా కుటుంబానికి చెందిన వారే పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. పైలా సన్యాసి నాయుడు 22 ఏళ్లు సర్పంచిగా సేవలందించగా.. ఆయన మరణాంతరం కుమారుడు పైలా జగన్నాథం సర్పంచ్‌గా మరో 20 ఏళ్లు సేవలు అందించారు.
తానాం గ్రామ సరిహద్దులో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ ఉంది. ఎంతోమంది యువకులు ఇక్కడ ఉపాధి పొందుతుండటంతో.. గ్రామాభివృద్ధిలో ఈ అంశం కీలకపాత్ర పోషిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఫార్మాసిటీతో కాలుష్య సమస్య ఉండటం వల్ల.. పెద్ద ఎత్తున పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
గ్రామంలో పూర్తిస్థాయి ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేస్తే విద్య, వైద్యరంగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి : పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 10.30 గంటలకు ఓటింగ్ శాతం..