విశాఖపట్నంలోని అడివివరం పరిధిలోని వి జినిగిరిపాలెం చెందిన తిరుమలరాజు వెంకటరమణరాజు తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన పి.వి.శ్రీనివాసరాజుకు చెందిన స్థలంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 6న రాత్రి పది మంది స్థలంలోకి ప్రవేశించి వాచ్‌మెన్‌పై దౌర్జన్యం చేశారు. దీనిపై వాచ్‌మెన్ వెంకటరమణరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో శ్రీనివాసరాజు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సర్వే సంఖ్య 319, 320లోని 25ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ముత్తంశెట్టి కృష్ణారావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ భూమిని తాను 2011లో కొనుగోలు చేశానని, దీనిపై వివాదం హైకోర్టులో ఉందన్నారు. ఈ స్థలానికి సమీపంలో భూమిలో కృష్ణారావుకు సంబంధించిన పాఠశాల ఉండటంతో ఆ పక్కనే ఉన్న తమ స్థలంపై కన్నేసినట్లు ఆరోపించారు. తనకు కృష్ణారావు నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈ మేరకు ఎస్‌ఐ రఘురామ్ వివరాలు తెలిపారు.
సంబంధం లేదు: ముత్తంశెట్టి కృష్ణారావు
'ఆ భూమితో మాకు ఎటువంటి సంబంధం లేదు. పాఠశాలకు సమీపంలో భూమి ఉండడంతో తరచూ వివిధ రకాల వ్యక్తులొచ్చి మా కార్యకలాపాలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తుండటంతో మేమే రెవెన్యూ, కలెక్టర్, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాం. మా సిబ్బంది ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లలేదు' అని ముత్తంశెట్టి కృష్ణారావు అన్నారు.
ఇదీ చదవండి: కరోనా బాధితులకు హోం క్వారంటైన్ కిట్లు