‘జగన్ సమక్షంలో వైకాపాలో చేరడం ఆనందంగా ఉంది. 13ఏళ్ల నా రాజకీయ జీవితంలో రెండుసార్లు తెదేపా ఎమ్మెల్యేగా.. ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. జగన్‌ను ప్రజల్లో, అసెంబ్లీలోనూ చూసినపుడు దమ్మూ-ధైర్యం (పవర్‌ఆఫ్ గట్స్, కరేజ్), ప్రేమ-అభిమానం(పవర్ ఆఫ్ లవ్), కరుణ(పవర్ ఆఫ్ కంపాషన్) అనేవాటికి ప్రత్యామ్నాయం అన్నట్లుగా నాకు కనిపించేవారు. పేదలకు ఏదైనా ఇవ్వడానికి ధైర్యం, ఇచ్చే గుణం ఉండాలి. అనేక సంక్షేమ పథకాలు అట్టడుగున ఉన్న పేదవాడికి చేరుతున్నాయి. ఇవన్నీ చూశాక, తెదేపా మళ్లీ ఆ స్థాయిలోకి వస్తుందని నాకైతే కనిపించడం లేదు. పరిపాలనా రాజధానిగా ప్రకటించడం ద్వారా విశాఖపట్నానికి ఒక ఘనకీర్తిని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఈ కారణాల దృష్ట్యా వైకాపాలో చేరా’ అని వాసుపల్లి గణేష్‌కుమార్ వెల్లడించారు.
'పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయి'
‘విశాఖ నగరం, విశాఖ జిల్లాల్లో తెదేపా తుడిచిపెట్టుకు పోతుందనడంలో సందేహమే లేదు’ అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఆయన కుమారులు శనివారం సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆయనతోపాటు విజయసాయిరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. ఎమ్మెల్యే గణేష్‌కుమార్ కుమారులు సూర్య, సాకేత్‌లకు ముఖ్యమంత్రి కండువా కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు. అనంతరం గణేష్, విజయసాయిరెడ్డి, వంశీ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలనేదే వైకాపా వ్యూహమా? అని విలేకరులు అడగ్గా విజయసాయిరెడ్డి పై విధంగా స్పందించారు. ‘గతంలో విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలనూ వైకాపా పోగొట్టుకుంది. వాసుపల్లి గణేష్ కుటుంబం వైకాపాలోకి రావడం పార్టీకి కొండంత బలానిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని చేరికలు చూస్తారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: