విశాఖ జిల్లా నర్సీపట్నంలోని సబ్ డివిజన్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి ఇది. ఈ దృశ్యాలను చూస్తే ఇదేదో వాహన రిపేరు కేంద్రమో, పాత సామాను గోదామో అనుకుంటారు కాని ఇది అక్షరాలా ఎక్సైజ్ కార్యాలయమే.
మాదక ద్రవ్యాల రవాణాలో...
నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గొలుగొండ, కొయ్యూరు, నాతవరం మాకవరపాలెం, రోలుగుంట, కోటవురట్ల మండలాలు ఉన్నాయి. వీటిన్నింటికీ నర్సీపట్నం అటవీ ప్రాంతం ఓ ముఖద్వారంలా ఉంటుంది. ఏ వాహనం ప్రయాణించినా... అక్కడి నుంచి పోవాల్సిందే. ఈ ప్రాంతంలో గంజాయి, నాటుసారా అక్రమ రవాణా అధికంగా ఉంటుంది. ఈ కేసుల్లో పట్టుబడిన వాహనాలే ఇప్పుడిలా ఎక్సైజ్ కార్యాలయంలో తుప్పు పట్టిపోతున్నాయి.
ఏళ్ల తరబడి గోదాంలోనే..
ఈ వాహనాలను పొందాలంటే నిబంధనల ప్రకారం సంబంధిత యజమాని న్యాయస్థానంలో తగిన పత్రాలు చూపి విడుదలకు అనుమతి తీసుకోవాలి. అయితే పట్టుబడిన వాహనాలను యాజమానులు తిరిగి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే నర్సీపట్నం స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 180 వాహనాలు ఏళ్ల తరబడి ఉంటున్నాయి. వీటిని భద్రపరచడానికి సరైన ప్రదేశాలు లేక చాలా కాలంగా అద్దె భవనాల్లోనే ఉంచుతున్నారు. ఇప్పుడు వీటిని కాపలా కాయడమూ తలకు మించిన భారంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. న్యాయస్థానం అనుమతితో 10 ఏళ్లు గడిచిన వాహనాలను రెండు పర్యాయాలలో వేలంపాట నిర్వహిస్తారు. ఈ మేరకు న్యాయపరమైన ఉత్తర్వులు అందిన వెంటనే వీటిని తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: