ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్‌కార్డులను ఈకేవైసీ చేయించుకునేందుకు బయోమెట్రిక్ అవసరం. గ్రామంలో సెల్ సిగ్నల్స్ లేక... విశాఖ జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జివలస గ్రామస్థులు ఇలా అడవి దారి పట్టారు. సుమారు 12 కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చి కొండల దగ్గర సిగ్నల్స్ రాక ఈకేవైసీ చేయించుకోవటానికి గుంపులు గుంపులుగా మూగారు. చిన్నాపెద్దా... ముసలి ముతక అనే తేడా లేకుండా 12 కిలోమీటర్ల దూరం నడిచుకొని వచ్చి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. తమ గ్రామంలోకి ఏ నెట్వర్క్ సిగ్నల్స్ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవస్థలను చూసైనా ప్రభుత్వం ఈ ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
శ్రీకాకుళంలోనూ అవే అవస్థలు
ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులతోపాటు పింఛన్ అందుకోవాలన్న వేలిముద్రలు వేయాల్సి వస్తుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో సిగ్నల్స్ అందకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్స్ కోసం చెట్లు, గుట్టలు ఎక్కుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ముకుందాపురం పంచాయతీ పరిధిలో రంగగం వీధి, మూల ముకుందాపురం గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తున్నారు. గ్రామంలో సిగ్నల్స్ లేకపోవటంతో గిరిజనులు 30 కుటుంబాలు మండుటెండను లెక్కచేయకుండా కొండలు ఎక్కి, వేలిముద్రలు వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలీమర్స్ బాధితుల అవస్థలు