విశాఖ మన్యం, అరకులోయకు కార్తిక మాసంలో పర్యటకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక ప్యాకేజీలతో వినూత్న విధానానికి నాంది పలికింది. ఆధ్యాత్మిక, విహార యాత్రలకు బస్సులను సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటు ధరలో ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఎక్కడ నుంచి ఎక్కడికి?
విశాఖ నుంచి మంచు అందాలు చూసే లంబసింగి ప్యాకేజీలో శనివారం, ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి ఉదయం నాలుగు గంటలకు లంబసింగి చేరేలా ఒక ప్యాకేజి సిద్ధం చేశారు. టికెట్ ధర పెద్దలకు రూ.525, పిల్లలకు రూ.400గా నిర్ణయించారు. పంచారామాలు అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరంలకు ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ బస్సులు ప్రతి ఆదివారం సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి అన్ని ప్రదేశాలను దర్శించి సోమవారం సాయంత్రానికి విశాఖ చేరుకునేలా ప్రణాళిక వేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ దానం తెలిపారు. నాలుగు వారాలకు కలిపి సుమారు 100 బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
పర్యటకానికి దైవదర్శనం తోడైతే...
పంచవైష్ణవ దర్శిని ప్యాకేజీ పేరుతో మార్గశిర మాసంలో ద్వారకా తిరుమల, సింహాచలం, అప్పనపల్లి, అంతర్వేది, అన్నవరం క్షేత్రాల ఆధ్యాత్మిక యాత్రలకు బస్సులను కేటాయించారు. ఈ వాహనాలు ప్రతి శనివారం సాయంత్రం 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రికి విశాఖ చేరుకునేలా ప్రణాళిక వేశారు. రోజు సర్వీసులు మాత్రమే కాకుండా ఈ ఆధ్యాత్మిక యాత్ర, విహార యాత్రల ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించే ఉద్దేశంతో ఈ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఇదీ చూడండి: