కొవిడ్ దెబ్బకు స్తబ్దుగా మారిపోయిన పర్యాటక రంగాన ఇప్పుడిప్పుడే సందడి మొదలైంది. 2 నెలలుగా సందర్శకుల సంఖ్య పెరుగుతుండడంతో విశాఖ నగరంలోని నక్షత్ర , సాధారణ హోటళ్ల ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 50 శాతం వరకు ఆక్యుపెన్సీ అవుతుండగా.. వారంతాలు, సెలవులప్పుడు గదులు నిండుతున్నాయి. విశాఖకు సెప్టెంబరు నుంచి జనవరి వరకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎక్కువగా హైదరాబాద్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. గతంతో పోల్చితే వచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ క్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం...
గతంలో విశాఖకు పర్యాటకులు బృందాలుగా వచ్చేవారు. కొవిడ్ వల్ల రెండు, మూడు కుటుంబాలు సొంత వాహనాల్లో వచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విశాఖ తీర ప్రాంతాలతో పాటు అరకు, బొర్రా, లంబసింగి, వంజంగి, భీమిలి వంటి ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల ఎక్కువమంది పర్యాటకులు ఆరోగ్యకర, వ్యక్తిగత ప్యాకేజీలకు ఆసక్తి చూపుతున్నారు. వారికి అనుగుణంగా పర్యటన, ప్రయాణాల సంస్థలు ప్యాకేజీలు తయారు చేస్తున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా ఆ దిశగా ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. విశాఖ వచ్చేవారు 3 రోజుల పాటు గడిపేలా ఒక రోజు విశాఖ, రెండో రోజు అరకులో, మూడో రోజు లంబసింగిలో రాత్రి బస చేసి తిరుగు ప్రయాణమయ్యేలా వారు ప్రణాళిక చేస్తున్నారు. అలాగే ఉదయం, రాత్రిళ్లు సిటీ టూర్ అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా అందరితో కలిసి కాకుండా ఒక కుటుంబానికి ఒక వాహనం, రెండు మూడు కుటుంబాలు కలిసి ఒక వాహనంలో వెళ్లేలా ప్రణాళిక చేస్తున్నారు.
కొన్ని దేశాలు పర్యాటకానికి అనుమతి ఇవ్వడంతో ఇక్కడి నుంచి దేశ, విదేశీ పర్యటనలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య కొద్దిగా పెరుగుతోంది. సింగపూర్, శ్రీలంక, బ్యాంకాక్, దుబాయ్ వంటి దేశాలు వెళ్లేందుకు ప్యాకేజీలు చేయమని పర్యాటకు సంస్థలను సందర్శకులు అడుగుతున్నారు. అలాగే దేశీయంగా కూర్గ్, కోయంబత్తూర్, మనాలీ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్యాకేజీలు కోరుతున్నారు.
పర్యాటక, హోటల్‌రంగ ప్రతినిధులు ప్రత్యేక సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా భయాలు లేకుండా హోటల్ సిబ్బందికి అందరికీ ఇప్పటికే వ్యాక్సిన్ పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యాటకలకు స్వాగతం చెబుతామని అంటున్నారు.
ఇదీ చదవండి: Somu Met Pawan: పవన్‌తో సోము వీర్రాజు భేటీ.. బద్వేలు ఉప ఎన్నికపై చర్చ !