Tips For Love and Affection: ఆలుమగలిద్దరూ పనిచేస్తే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, పనుల ఒత్తిడి ఇద్దరి మధ్య అలకల్ని, అపార్థాల్ని పెంచుతాయి. అలాగని ఒకరి తప్పొప్పుల్ని మరొకరు ఎంచుకుంటుంటే.. గొడవలు పెరిగిపోతాయి. ఒకరికొకరు భారం అవుతారు. మరి అలాకాకూడదంటే..
- భార్యాభర్తల బంధంలో ప్రేమాభిమానాలు చూపించుకోవడం ఎంత ముఖ్యమో.. ఎవరి బాధ్యతల్ని వారు అర్థం చేసుకోవడమూ అంతే అవసరం. బాధ్యత అంటే బరువులెత్తేస్తున్నట్లు ఫీలైపోకండి. కుటుంబంలో మీ పాత్ర ఏంటి? మీరు చేయాల్సిన పనులు ఏంటి? వాటిని ఎంత వరకూ నెరవేరుస్తున్నారు. ఎక్కడ విఫలమవుతున్నారు గమనించుకోండి. ఎందుకంటే.. ఇంటి అవసరాలను, కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకోగలిగితేనే అపార్థాలు తొలగి అనుబంధం పదిలమవుతుంది.
- పని ఒత్తిడి మీ జీవన శైలిలో భాగం అయ్యి ఉండొచ్చు. అలాగని దీర్ఘకాలం ఆ ప్రభావం ఉంటే... దాంపత్యంలో కలతలు ఖాయం. ఆలుమగల మధ్య అభద్రత మొదలైతే.. ఇది సంసార జీవితాన్ని నిరాసక్తంగా మార్చేయొచ్చు. అందుకే... ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మీరు చేయాల్సిన పనులు నిర్వర్తించడంలో అలక్ష్యం చేయొద్దు.
- ముఖ్యంగా మీ భాగస్వామికీ, పిల్లలకీ సమయం కేటాయించే విషయంలో, వారి అవసరాలను తెలుసుకునేటప్పుడూ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యుల సాయమూ తీసుకోండి. వారితో మాట్లాడి పని విభజన చేసుకోండి. మీ ఇబ్బందులని వారితోనూ చర్చించండి. అప్పుడు వారూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
- ఇంటిపనైనా, ఉద్యోగమైనా ఎవరి స్థాయికి వారికి అవి ముఖ్యం అన్నది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి. మీరే హోదాలో ఉన్నా.. మీ భాగస్వామి ఉద్యోగాన్ని, వారి సంపాదననూ తక్కువ చేయొద్దు. వీలైతే మరో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించండి. మీలానే వారికీ ఒత్తిళ్లు ఉంటాయని గ్రహించండి. అప్పుడే ఎదుటివారి బాధలు అర్థమవుతాయి. మీ అనుబంధం ఆనందంగా సాగుతుంది.
ఇవీ చదవండి: