జగన్ పాలనలో వెనకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితి మరింత దిగజారిపోయిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని ఆయన మండిపడ్డారు.
కేవలం 5, 10 శాతం పనులు పూర్తిచేస్తే ఎన్నో రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఉత్తరాంధ్ర నేతలు కనీసం సీఎం జగన్ వద్దకు వెళ్లి అడిగే పరిస్థితులే లేవని అచ్చెన్న ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు న్యాయం చేయకపోగా..తీవ్ర అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర మంత్రులు సీఎం వద్ద సమస్యలు ప్రస్తావించగలరా? ఉత్తరాంధ్రకు తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చెబుతాం. వైకాపా ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధి గురించి వివరించగలదా? -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఉత్తరాంధ్రకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే కనీస పోరాటం చేయట్లేదు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా అమ్మేశారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న తెదేపా నాయకులపై కక్షసాధింపులకు దిగుతున్నారు. -పల్లా శ్రీనివాసరావు, తెదేపా నేత
ఇదీ చదవండీ.. CHANDRABABU : 'ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు'