డ్వాక్రా సంఘాల రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద తొలివిడత నిధులను వచ్చే నెల 11న సభ్యులు ఖాతాలకు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి జిల్లాలో 35, 715 సంఘాలు అర్హత సాధించాయి. అందులో మూడు లక్షల 81వేల 506 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ 11 నాటికి సక్రమంగా వాయిదాలు కట్టినవారికి మాత్రమే ఈ పథకానికి అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది.
- సచివాలయాల్లో అర్హుల జాబితా..
జిల్లాలో మొత్తం 38 వేల సంఘాలు ఉండగా వాటిలో 4.5 లక్షల మంది ఉన్నారు. వీటిలో 35, 715 సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నట్లు ఆయా బ్యాంకుల నుంచి జిల్లా యంత్రాంగానికి నివేదిక వచ్చింది. ఆ సంఘాల పేరిట గత ఏడాది ఏప్రిల్ 11 నాటికి రూ.1,116.29 కోట్లు రుణాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. మొత్తంలో తొలివిడతగా 279.8 కోట్లు సభ్యుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది. తర్వాత మూడేళ్లలో 279 .8కోట్లు విడుదల చేస్తుంది. రుణమాఫీకి అర్హత పొందిన డ్వాక్రాా సంఘాల జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శించారు. సభ్యులు తమ సమీపంలోని సచివాలయానికి వెళ్లి పరిశీలించవచ్చు. ఒకవేళ అభ్యంతరాలుంటే ఈనెల 30లోగా సచివాలయాలకు తెలియజేయాల్సి ఉంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.