MARGADARSI CHIT FUNDS NEW BRANCHES : రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకుని మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ తెలంగాణలో కొత్తగా మూడు శాఖలను ప్రారంభించింది. వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో ఏర్పాటు చేసిన శాఖలను సంస్థ ఎండీ శైలజాకిరణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సేవలు అందిస్తున్న మార్గదర్శి, నేటితో నాలుగు రాష్ట్రాల్లో 118 శాఖలకు విస్తరించింది.
శనివారం ఉదయం ముందుగా వనపర్తి జిల్లా కేంద్రంలో 116 శాఖను ఘనంగా ప్రారంభించారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వర్చువల్‌గా ఈ శాఖను ప్రారంభించారు. నూతన శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శి సంస్థల సీఈఈ మధుసూదన్, వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి శాఖ కార్యకలాపాలను ప్రారంభించారు.
సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడలో తమ 117వ శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ రాజాజీతో కలిసి సీఈఓ సత్యనారాయణ, బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 118వ బ్రాంచ్‌ను రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.
మార్గదర్శిలో సభ్యులు ఎంతో నమ్మకంతో కష్టార్జితాలను ఆదా చేసుకుంటున్నారని శైలజాకిరణ్ అన్నారు. వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. సుశిక్షితులైన సిబ్బంది ద్వారా అన్ని శాఖల సభ్యులకు ఒకే రకమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
'మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే' అంటూ 1962లో తెలుగు నేలపై పురుడుపోసుకున్న మార్గదర్శి ఇంతింతై వటుడింతై అన్నట్లు 118 శాఖలుగా విస్తరించింది. ఆరు దశాబ్దాలకుపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సేవలు అందిస్తున్న మార్గదర్శిని ఆదరిస్తున్నందుకు ఖాతాదారులకు ఎండీ శైలజాకిరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థిక అవసరాలకు తీర్చుకునేందుకు చిట్స్ మేలైన మార్గమని శైలజాకిరణ్ సూచించారు.
"ఈరోజు రామోజీరావు గారి జయంతి సందర్భంగా వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో కొత్త శాఖలు ప్రారంభించాం. తద్వారా మరింత మందికి మార్గదర్శి ఆర్థిక సేవలు అందించేందుకు మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మార్గదర్శి ఎప్పుడూ మీకు సేవలందించేందుకు ముందుంటుంది - శైలజాకిరణ్, మార్గదర్శి ఎండీ