Ramoji Rao Birth Anniversary Celebrations: అక్షర యోధుడు, అలుపెరుగని ధీరుడు స్వర్గీయ రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అంజలి ఘటించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. రామోజీరావు జయంతి వేళ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలుగు రాష్ట్రాలలో రామోజీరావు 88వ జయంతి వేడుకలను సగర్వంగా నిర్వహించారు. సమాజానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు నాంది రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రామోజీరావు వేసిన బాటలు నేటికీ స్ఫూర్తిదాయకమని, వ్యక్తిగా మొదలై శక్తిమంతమైన వ్యవస్థగా రామోజీరావు ఎదిగారని అన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి రామోజీరావు బాటలు పరిచారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ సిబ్బంది అన్నారు. రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటించి మౌనం పాటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
"రామోజీరావు సర్ ప్రతి సంవత్సరం స్కూల్లో విద్యా వ్యాప్తికి, అదే విధంగా పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం రకరకాల పద్ధతులు అవలంభిచాలని ఆదేశిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. అదే పద్ధతిలో వారు ఈరోజు మా మధ్య లేకున్నా కూడా ఉన్నట్టుగానే భావిస్తున్నాము. స్కూల్లో, ఇతర విషయాలలో ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రతిజ్ఞ చేస్తున్నాము". - డాక్టర్ రావి చంద్రశేఖర్, రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ
సికింద్రాబాద్ వారాసిగూడలో బీజేపీ సీనియర్ నాయకుడు రవిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో GHMC కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. వ్యాపార, వాణిజ్య, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మీడియా రంగంలోనూ నూతన శకాన్ని ఆవిష్కరించారన్నారు. పెద్దపల్లి M.L.A చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో రామోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ప్రతి విద్యార్థి రామోజీరావును స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు కాంక్షించారు. విద్యార్థి, విద్యార్థినీలతో కలిసి ఆయన చిత్రపటం వద్ద టెంకాయ కొట్టి అంజలి ఘటించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని యాంకి గ్రామానికి చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు అబ్బురపరిచేలా పెన్సిల్‌తో రామోజీరావు చిత్రాన్ని వేయడంతో పాటు కోడిగుడ్డుపై ఆయన చిత్రాన్ని వేసి ఘనంగా నివాళులర్పించారు.
రామోజీరావుకు టీడీపీ వినూత్న నివాళి - 'ఎక్స్'లో స్పెషల్ వీడియో