TDP Leaders Protest in Visakhapatnam: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ విశాఖలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ టీడీపీ ఆరోపించింది. పోలీసుల తీరుపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు ప్రవర్తించిన తీరును ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కేవలం తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
Tension in Visakhapatnam: పోలీసులకు తెలుగుదేశం నేతలకు మధ్య తోపులాట: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ విశాఖలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ర్యాలీకి సిద్ధమైన తెదేపా కార్యకర్తలు నేతలను పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ అనుమతి లేదంటూ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు తెలుగుదేశం నేతలకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా పలువురు నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదులు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు లేదా అంటూ టీడీపీ కార్యకర్తలు, నేతలు పోలీసులను ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించినవారిని పోలీసులు బలవంతంగా ఎత్తుకుని వెళ్లి వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
TDP Leader Ayyannapatrudu Fires on YCP and Police: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు: గత మూడు రోజులుగా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు. ఇంటికి వచ్చిమరి దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారని తెలిసి... సానుభూతి తెలిపేందుకు వచ్చే టీడీపీ నేతలు, నాయకులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటామని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. వైసీపీ నేతల ప్రోత్సాహంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మంత్రులు, పోలీసులే అత్యుత్సాహం చూపిస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. శాంతియుతంగా చేసుకునే నిరసనలను సైతం అనిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సైతం పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు.
TDP Leader Vangalapudi Anitha Fires on YCP and Police: వంగలపూడి అనిత: తాము కేవలం తమ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేసుకుంటున్న నిరసన కార్యక్రమాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినాయకుడికి మద్ధతుగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కులేదా అని పోలీసులను ప్రశ్నించారు. ఆరునెలలు పోతే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్న అనిత.. అనంతరం ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని హెచ్చరిచారు. పోలీసులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి పని చేస్తున్నారని మండిపడ్డారు.