EX minister Ganta sensational comments on the YSRCP govt: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తెలుగుదేశం పార్టీ నేతలు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని.. అభివృద్ధిలో 1.5 శాతం కూడా వృద్ధి సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ మహానాడు కార్యక్రమం పోస్టర్ విడుదల.. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజమండ్రిలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ చిరంజీవి రావు, విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదు. గడిచిన నాలుగేళ్లలో విశాఖ రైల్వే జోన్ ఊసేలేదు. పోలవరం పురోగతిలో మార్పులేదు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ముఖ్యమంత్రిని కలిసి అడిగే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. అందులో ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని మొదటి డిమాండ్‌గా ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధం అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. నిన్నటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. మద్యపానం నిషేధం కాకపోగా, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతోంది. దీని కారణంగా అనేక మంది ప్రాణాలను కోల్పోయారు'' అని ఆయన అన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండానే జగన్ పాలన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను రాజధాని అని చెబుతూ అభివృద్ధి చేయకుండా.. ఇక్కడి ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అక్కడ అమరావతిలో రైతులు నిరాహారదీక్షలు చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు ఎన్నోరకాల ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని.. 4 ఎమ్మెల్సీల్లో తెలుగుదేశం విజయం సాధించిందన్నారు. 98.5 శాతం హామీలన్నీ అమలు చేశామని సజ్జల రామకృష్ణ రెడ్డి చెబుతున్నారని.. 1.5 శాతం వృద్ధి కూడా సాధించలేదని గంటా వ్యాఖ్యానించారు. ప్రజల్ని ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే విధ్వంసంతో కూడిన పరిపాలనను ప్రారంభించారన్నారు.
ప్రథమ స్థాయి నుంచి అథమ స్థాయికి.. విద్యా వ్యవస్థలో ప్రథమ స్థాయిలో ఉండాల్సిన రాష్ట్రం అథమ స్థాయికి చేర్చారని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. టీడీపీ ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందిస్తే.. జగన్ రెడ్డి కేవలం 10 లక్షల మందికి అదీ విడతల వారీగా అందిస్తున్నారని మండిపడ్డారు. 2020-21లో 1వ విడత, 2022-23లో 2వ విడతలుగా ఎగనామం పెట్టారని ఆక్షేపించారు. నాలుగేళ్లల్లో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా రూ. 4 వేల 500 కోట్లు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. ఫీజలు పెండింగ్ వలన దాదాపు 2 లక్షల మంది విద్యార్ధులు రోడ్డుపాలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి