తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్తుల విక్రయ వివాదంపై ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కీలక సూచనలు చేశారు. భూముల విక్రయంపై ప్రభుత్వ పెద్దలతో పాటు తితిదే చైర్మన్, ఈవోలతో ఆయన మంతనాలు జరిపారు. తితిదే వ్యవహారంలో వివాదాలకు తావివ్వకుండా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందన్నారు. వారి మనోభావాలను గౌరవించే విధంగా తితిదే పాలకమండలి నిర్ణయం తీసుకోవడం మంచిదని స్పష్టం చేశారు. భూముల విక్రయం విషయంలో వివాదాలకు తెరదించే విధంగా నిర్ణయం తీసుకోవడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా మూడు నెలల తర్వాత మళ్లీ శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులందరూ ఎదురు చూస్తున్న తరుణంలో.., త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలన్నారు.