కొప్పు దేవి... అనే విద్యార్థినిది విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం మారుమూల గ్రామమైన గెమ్మెలి. చిన్నప్పటి నుంచి తన గ్రామంలో రోగాలు, మరణాలు చూసి ఆమె చలించిపోయింది. దగ్గరలోని ఆసుపత్రికీ వైద్యులు రాక మనస్తాపానికి గురైంది. ఎలాగైనా డాక్టర్ కావాలని నిర్ణయించుకుంది. ఓ పక్క తల్లిదండ్రులు నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్క నిండదు. ఐటీడీఏ ప్రోత్సహంతో ఇంటర్ వరకు పట్టుదలతో చదివింది. నీట్ రాసేందుకు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం లక్ష రూపాయలు కావాలని... ఒక్క అవకాశం ఇవ్వాలని భీష్మించుకు కూర్చుంది దేవి.
సీటు సాధించినా.. సమస్య తీరలేదు
కుమార్తె డాక్టర్ కావాలనే కోరికను కాదనలేక కోచింగ్ ఇప్పించేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడ్డారు. తండ్రి అప్పు చేసి 50 వేలు తీసుకొస్తే... తల్లి డ్వాక్రా రుణం ద్వారా మరో 50 వేలు తీసుకుంది. అలా.. కష్టపడి మరీ శిక్షణ తీసుకున్న దేవి.. గిరిజన కోటాలో గన్నవరంలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. ఇక బాధలన్నీ తీరినట్టే అనుకుంది. నీట్ ద్వారా సీటు వచ్చింది కాబట్టి.. ఫీజు ఉండదు అనుకున్నారు. తీరా కళాశాలకు వెళ్లాక ఏడాదికి లక్షా 50వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆలోచనలో పడ్డారు. అడ్మిషన్ ఫీజు మాత్రమే కట్టి వెనుదిరిగారు.
చివరికి ఏమైందంటే...
గత వారం స్పందన కార్యక్రమంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు విజయ్ కుమార్ను దేవి కలిసింది. ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రమే వస్తుందని చెపారు. అప్పటి నుంచి కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి..డబ్బు కోసం ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఈటీవీ - భారత్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీని కలిసి వివరణ కోరింది. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు విజయ్ కుమార్ను పిలిచి... తక్షణమే విద్యార్థినికి అవసరమైన సాయం చేయాలని ఆదేశించారు. చివరికి ఆ అమ్మాయి కలనెరవేరే మార్గం దొరికింది. సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తన కల సాకారం అయ్యేందుకు ఓ దారి దొరికిందని దేవి ఆనందానికి అవధుల్లేవు.