School Radio: ఈమె పేరు గాలి అరుణ. పిల్లల్లో వినూత్న ఆలోచనలు ప్రోత్సహించడమంటే ఈమెకు ఎంతో ఇష్టం. ఆ మక్కువే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసింది. విద్యార్థుల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు ఓ స్కూల్ రేడియోను 2015లో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 వేల మందికి ఈ మాధ్యమాన్ని చేరువ చేశారు. 5 రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్కూల్ రేడియో గుణాత్మక మార్పునకు నాంది పలుకుతోంది.
రెండున్నర దశాబ్దాలకు పైగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో గాలి అరుణ పాలు పంచుకున్నారు. యునిసెఫ్ వంటి సంస్థలతో పాటు బాలల కార్యక్రమాల కోసం పనిచేశారు. ఆ అనుభవంతో పిల్లల్లో బిడియాన్ని పోగొట్టడం, ఊహాశక్తి, కల్పనా చాతుర్యం పెంపొందించేందుకు స్కూల్ రేడియోను ఆరంభించారు.
పిల్లలు సొంతంగా రచనలు చేయడంతోపాటు రేడియో కార్యక్రమాలు నిర్వహించేలా గాలి అరుణ వారిని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు బృందంగా ఏర్పడి తాము రాయాల్సిన అంశాన్ని ఎంచుకోవడం, వాటిపై మాట్లాడడం, విషయాన్ని సేకరించుకోవడం, రికార్డింగ్ చేయడం.. చివరిగా రేడియోలో ఉంచేంత వరకు పిల్లలకు అండగా నిలుస్తున్నారు అరుణ.
కరోనా సమయంలో స్కూల్ రేడియోకు మెరుగులు దిద్దిన గాలి అరుణ.. విద్యార్థులకు దాన్ని మరింత చేరువ చేశారు. కేంద్ర ప్రభుత్వం సహా అనేక సంస్థలు ఆమె కృషిని గుర్తించి ప్రోత్సహించాయి.
ఇదీ చదవండి: యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం..