* పెందుర్తికి చెందిన రామకృష్ణ తన అన్నయ్యకు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తెచ్చుకోవాలని చెప్పడంతో ఓ మందుల దుకాణం నిర్వాహకుడి సాయంతో ఒక్కో ఇంజక్షన్ రూ.30 వేలకు కొనుగోలు చేశారు.
* మహారాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విశ్రాంత పోర్టు ఉద్యోగికి చికిత్స చేస్తున్నారు. ఇంజక్షన్లు అవసరమని చెప్పడంతో కుటుంబ సభ్యులు వాటి కోసం పలువురిని ఆరా తీశారు. రుషికొండలో ఒకరిని సంప్రదించగా ఒక్కో ఇంజక్షన్ రూ.35 వేలు చెప్పారు. వేరొకరిని సంప్రదించగా రూ.32 వేలన్నారు. చివరికి ఆసుపత్రి సిబ్బంది అవసరం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
* జగదాంబకు వెళ్లేదారిలోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలుగా బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఇంజక్షన్లను విదేశాల నుంచి రప్పించాలని రూ.2 లక్షలకు పైగా వసూలు చేశారు. ఆ మందులేవో చెబితే తామే తెప్పిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినా కుదరదన్నారని సమాచారం.
* గోపాలపట్నానికి చెందిన నగేష్ తన తండ్రిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆరు ఇంజక్షన్లకు ఆసుపత్రి యాజమాన్యం రూ.లక్షకుపైగా బిల్లు వేసిందన్నారు.
* కంచరపాలెంకు చెందిన ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించగా తల్లి కోలుకుంది. తండ్రికి ఇంజక్షన్లు ఇవ్వాలని చెప్పారు. అప్పటివరకు అయిన బిల్లు చెల్లిస్తేనే అవి ఇస్తామని చెప్పడంతో పాటు భారీగా వసూలు చేయడంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
విశాఖ నగరంలో ‘రెమ్‌డెసివిర్’ ఇంజక్షన్ల పేరుతో దందా ఆగడం లేదు. పోలీసులు నిఘా ఉంచుతున్నా.. ఔషధ నియంత్రణశాఖ.. నిఘా అమలు (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్).. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా అడ్డుకట్టపడడం లేదు. కొవిడ్ బాధితులు త్వరగా కోలుకోవడానికి వినియోగించే ఈ ఇంజక్షన్‌లు నల్లబజారులో కాసులు కురిపిస్తోంది. దీంతో వీటిని రోజుకో విధంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్క ఇంజక్షన్ వయల్‌ను రూ.30 వేల నుంచి రూ.35 వేలకు విక్రయిస్తున్నారు. ఆరు ఇంజక్షన్లను నల్లబజారులో చాలామంది రూ.2 లక్షలు పెట్టి కొంటున్నారు. నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో ఔషధ నియంత్రణశాఖ, విజిలెన్స్ అధికారులు వరుసగా దాడులు చేస్తుండటంతో పలు రకాల వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
అంతా వారే...
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి విక్రయించడంలో దళారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. విక్రయదారులు నేరుగా తెరమీదకు రావడం లేదు.
కనీసం ఇద్దరు, ముగ్గురు మధ్యవర్తులతో ఈ వ్యవహారం సాగిస్తున్నారు. వీరు ఆయా ఆసుపత్రుల ప్రాంగణాల్లో తిరుగుతూ అవసరం ఉన్న బాధితులను గుర్తించి మరొకరి ఫోన్ నంబరు ఇచ్చి... తన పేరు చెప్పి వివరాలు చెబితే ఇంజక్షన్లు ఏర్పాటు చేస్తారని వివరిస్తున్నారు. ఆ వ్యక్తి నిజంగా బాధితులని భావించాకే శివారు ప్రాంతాలకు వెళ్లి వేరొకరితో ఇంజక్షన్లు తెప్పించి ఇప్పిస్తున్నారు. వీరు ఒక్కో వయల్‌ను రూ.35 వేలు వరకు అమ్ముతున్నారు.
* ఇంజక్షన్ల విక్రయానికి ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో సేవలందించే కొందరు మందుల దుకాణ నిర్వాహకులు, ఫార్మాసిస్టులు, వైద్యపరీక్ష కేంద్రాల్లో పనిచేసే కొందరు సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో గుర్తిస్తున్నారు.
* మధ్యవర్తులు ధర విషయంలో బాధితులతో ఒక్కోలా మాట్లాడుతున్నారు. నేరుగా మీరు వెళ్లి తీసుకుంటే ఒక్కో వయల్‌కు రూ.35 వేలు, మా ద్వారా అయితే రూ.30 వేలుకు ఇప్పిస్తామని చెబుతున్నారు.
అనుమతులున్న వాటికి సులభం
అధికారులు మాత్రం రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదంటున్నారు. ప్రస్తుతానికి ఆరు కంపెనీలు వీటిని సరఫరా చేస్తున్నాయని చెబుతున్నారు. కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ఆసుపత్రులకు దాదాపు వైద్య ఆరోగ్యశాఖ నుంచే వయల్స్‌ను పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కంపెనీ డీలర్ల నుంచి కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. విశాఖలో డిమాండు మేరకు ఆయా కంపెనీలు ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకున్న కొందరు...తమ ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారు? ఏ రోజు ఎంతమందికి ఎన్ని వయల్ ఇవ్వాలో ఆ వివరాలతో ఆసుపత్రులు వైద్యఆరోగ్యశాఖకు ఇండెంట్ సమర్పిస్తే దాదాపుగా వారే సమకూరుస్తున్నారు. అప్పటికప్పుడు వచ్చి ఇవ్వాలని డిమాండ్ చేయడమే ఒక్కోసారి ఇబ్బందిగా మారుతోంది. వైద్యులు ముందుగానే ఎవరికి అవసరమో నిర్ధారించుకొని వివరాలు సమర్పిస్తే తెప్పించడం సులభమని అధికారులంటున్నారు.
పనిచేసే సిబ్బందే
కొన్ని ఆసుపత్రుల వైద్య సిబ్బందే వయల్స్‌ను పక్కదారి పట్టించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంజక్షన్లను దాచేసి మధ్యవర్తులకు సమాచారం పంపుతున్నారు. ఇటీవల అధికారుల తనిఖీల్లో ఈ విషయం గుర్తించారు. మధ్యవర్తులకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* కొన్ని ఆసుపత్రుల్లో పని చేసే కొందరు నర్సింగ్ సిబ్బంది బాధితులకు ఇంజక్షన్లు చేయకుండానే చేసినట్లు చెబుతున్నారు. బాధితులు, వైద్యుల కళ్లుగప్పి వాటిని దాచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రోగులకు మాత్రం వయల్స్ ఇచ్చేసామని రాస్తున్నారు. వాటిని మధ్యవర్తుల ద్వారా అమ్ముతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
* మరో వైపు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులు ఈ వయల్స్‌ను దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ ఆసుపత్రి పేరుతో అవసరం లేని బాధితుల పేరు మీద వీటిని తెప్పించి నల్లబజారుకు తరలిస్తున్నారు. శనివారం ఇంజక్షన్లను అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఓ డాక్టర్ పలుమార్లు ఫోన్ చేసి ఆరాతీయడం దీనికి మరింత బలం చేకూర్చింది.
* ఆరోగ్యశ్రీ బాధితులకు ఆసుపత్రుల్లో ఒక్కో ఇంజక్షన్‌ను రూ.2500 ఇస్తున్నారు. ఆరు కావాలంటే రూ.15 వేలే ఖర్చవుతుంది. అదే ఇతరులకైతే రూ.3500గా నిర్ణయించారు. కానీ నల్లబజారులో ఒక్కోటి పదింతల ధరలకు అమ్ముతున్నారు.
ఫిర్యాదు చేయండి: రెమ్‌డెసివిర్, టోసిలీజుమాబ్, బెవాసిజుమాబ్ ఇంజక్షన్లను ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావొచ్చు. పలువురు వీటిని నల్లబజారుకు తరలిస్తున్న నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటికే కొందర్ని వలపన్ని పట్టుకొన్నాం. బాధితులు మాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రైవేటు ఆసుపత్రులు కంపెనీల నుంచి ఎంఆర్‌పీ ధరకే తెప్పించుకోవచ్చు.
- సునీత, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్
ఇదీ చదవండి: