India skills 2021: రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో కీలకంగా ఉండనున్న రంగాల్లోకి.. నైపుణ్యవంతులైన యువతను ప్రవేశపెట్టాలని చూస్తోంది భారత ప్రభుత్వం. ఈ కారణంగానే ఆయా రంగాల్లో ఆసక్తి, అభిరుచి ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇండియా స్కిల్స్ -2021 పేరిట దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తోంది.
విశాఖ కేంద్రంగా...
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ కేంద్రంగా ఇండియా స్కిల్స్ పోటీలు నిర్వహించారు. దక్షిణ భారత్ స్థాయిలో 5రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడి పోటీల్లో పాల్గొన్నారు. విశాఖలోని 11 ప్రదేశాల్లో జరిగిన ఇండియా స్కిల్స్-2021 పోటీల్లో... మొత్తంగా 52 విభాగంలో 5 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
మనం విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దానికి, పని ప్రదేశాల్లోని అవసరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. పరిశ్రమ అవసరాలకు తగట్టు మన విషయ పరిజ్ఞానం ఉండడం లేదు. ఈ లోపాన్ని సవరించి, తగిన మార్పులు చేసుకునేందుకు ఇలాంటి పోటీలు చాలా ఉపయోగపడతాయి. యువతకు నైపుణ్యాల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. - కవిత గౌడ, కర్ణాటక స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి
ప్రతి విభాగంలో ఇద్దరు విజేతలు..
ఈ పోటీల్లో ప్రతి విభాగంలో ఇద్దర్ని విజేతలుగా నిర్ణయించారు. వీళ్లు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లే. జాతీయ స్థాయిలోనూ ఉత్తమంగా రాణిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో చైనా షాంఘైలో జరగనున్న ప్రపంచ నైపుణ్య పోటీల్లో.. భారత్ తరుపున పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంటారు. అందుకే.. ఈ పోటీలకు అంత క్రేజ్.
నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని..
ఎంచుకున్న రంగంపై అభిరుచి, అందులో రాణించాలనే బలమైన సంకల్పమే.. కెరీర్ నిర్మాణంలో సోపానాలుగా ఉపయోగపడుతుంది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని భావిస్తున్నాయి.
ఏడాదికి ఒకసారి నిర్వహిస్తే బాగుంటుంది...
ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎంతో మంచిది. చాలా మంది వీటిలో పాల్గొంటున్నారు. వాళ్లు కేవలం పోటీ పడడం మాత్రమే కాదు... వాళ్ల కేరీర్‌లను నిర్మించుకుంటున్నారు. ఈ పోటీలు విద్యార్థులకు మరింత పరిజ్ఞానాన్ని అందిస్తాయి. ప్రస్తుతం రెండేళ్లకు ఓ సారి ఇండియా స్కిల్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఒకసారి నిర్వహిస్తే బాగుంటుంది. ఇలాంటి పోటీల వల్ల మన యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొద్దిపాటి విద్యార్హతలు ఉన్న విద్యార్థులకూ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు... 10, ఐటీఐ లేదా డిప్లమా చదివినవారికి నైపుణ శిక్షణ అందిస్తున్నారు. వీరు రాష్ట్రంలో, దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.
ఇదీ చదవండి
India skills 2021: విశాఖ వేదికగా.. దక్షిణ భారత నైపుణ్య పోటీలు