విశాఖ వాంబే కాలనీలో జరిగిన విల్లపు రాంబాబు హత్య కేసును విశాఖ పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. హత్యకు కీలక సూత్రధారి అయిన వెంకటేష్ సహా మరో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ వాంబే కాలనీలో ఈ నెల 3వ తేదీన విల్లపు రాంబాబు అనే వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. మిత్రుల మధ్య జరిగిన వివాదమే హత్యకు దారి తీసింది. చిన్నపాటి మనస్పర్థలకే నగరానికి చెందిన కృష్ణమోహన్, వెంకటేశ్ ఓ వర్గంగా... రాంబాబు, అంజి, శివ కలిసి మరో వర్గంగా ఏర్పడ్డారు. వీరిలో కృష్ణ మోహన్ నగరాన్ని వీడి వెళ్లిపోగా అతన్ని పిలిపించమని వెంకటేశ్‌తో ప్రత్యర్థి వర్గం గొడవ పెట్టుకునేవారు. ఈ నెల 3న కూడా ఇలానే చిన్న గొడవ పడ్డారు. అయితే దీనిలో రాంబాబు అనే వ్యక్తి కొంత ఆవేశంతో "మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను" అంటూ మరో వర్గానికి సవాల్ విసిరాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేశ్.. మరికొందరితో కలిసి రాంబాబును అదేరోజు రాత్రి హత్య చేసినట్లు డీసీపీ రంగారెడ్డి తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కక్షలతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ అన్నారు. నిందితులపై గతంలో నేరచరిత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపి రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు.