Visakha land Scam: విశాఖ నగరంలో 2004 నుంచి 2012 వరకు జరిగిన భూముల ఆక్రమణలు, అక్రమాలపై 2017లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ శోధించింది. గ్రేహౌండ్స్ డీఐజీ హోదాలో ఉన్న.. ఒక ఐపీఎస్ అధికారి ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. విశాఖ చుట్టుపక్కల 1,225.92 ఎకరాల ప్రభుత్వ భూమిని ..1905 భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద తగిన చర్యలు తీసుకుని కాపాడాల్సి ఉందని కూడా సిట్ నివేదికలో తేల్చింది. 7,136 చదరపు గజాల ప్రభుత్వ భూమి, 4,318 చదరపు మీటర్ల విలువైన భూములు కూడా ఆక్రమణల్లో చిక్కుకున్నట్లు తేలింది.
పేదలకు ఇచ్చే ఎసైన్డు భూమి పేరుతో అక్రమాలు జరిగిన 751.19 ఎకరాల భూమిని తిరిగి అదే కోటా కింద పునరుద్ధరించాల్సి ఉందనీ స్పష్టం చేసింది. ఇవి కాకుండా వెబ్‌ల్యాండ్ రికార్డులు మార్చేసి భవిష్యత్తులోను మరిన్ని భూములు ఆక్రమించుకునేందుకు కొందరు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు సిట్ తేల్చింది. అప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక మంత్రి, అప్పటి అధికార పార్టీ ఎంపీ కుమారుడు, పలువురు ఇతర రాజకీయ నాయకుల ప్రమేయం ఇందులో ఉంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన 49 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న సిట్ సిఫార్సు.. ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయో చెప్పడానికి నిదర్శనం.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ గ్రామీణం, పరవాడ, భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, ఎస్.రాయవరం, సబ్బవరం, యలమంచిలి, పాయకరావుపేట మండలాల్లోని ప్రభుత్వ భూములు ప్రధానంగా ఆక్రమణకు గురయ్యాయి. బుచ్చయ్యపేటలో 379.99 ఎకరాల ప్రభుత్వ భూమికిగాను 194.61 ఎకరాలను మింగేశారు. భీమన్నదొరపాలెంలో 124.14 ఎకరాలు, రాంబిల్లిలో 108.61 ఎకరాల ప్రభుత్వ భూమి, 26.19 ఎకరాల దేవాదాయశాఖ భూమి కూడా ఆక్రమణల చెరలో చిక్కింది. దేవరపల్లిలో 83.61 ఎకరాలు, సబ్బవరంలో 71.73, చుక్కపల్లిలో 69.01, ఆనందపురంలో 62, గోపాలపట్నంలో 33.45, విశాఖపట్నం గ్రామీణలో 27.39 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనమైంది.
విశాఖ చుట్టుపక్కల భూములను హస్తగతం చేసుకునే క్రమంలో వాటి వర్గీకరణకు సంబంధించి రికార్డుల్లో అనేక మార్పులు చేశారు. పలు ప్రభుత్వ భూములను జిరాయితీ భూములుగా, విస్తీర్ణం పెంచి చూపించారు. ఎసైన్డు భూములకు సంబంధించి అసలు పట్టాదారు స్థానంలో కొత్త పేర్లు పుట్టుకొచ్చాయి. కొన్ని కేసుల్లో ఇంటి పేర్లు మారిపోయాయి. ఇలాంటివి మొత్తం 2,998 కేసులను గుర్తించారు.
భూపరిపాలనశాఖ కమిషనర్ వీటిని గుర్తించి పరిశీలన జరపాలని సిట్ బృందాలకు నివేదించారు. 936 కేసుల్లో లోతైన దర్యాప్తు జరిపారు. ఇందులో 20 కేసుల్లో ప్రభుత్వ భూములను జిరాయితీ భూములుగా మార్చేశారని తేల్చారు. మరో 34 కేసుల్లో రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉంటే వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ఎసైన్డు భూమిగా చూపించారు. ఈ 54 కేసులకు సంబంధించి క్రిమినల్ దర్యాప్తు చేయాలని సిట్ నివేదించింది. మరో 43 కేసులకు సంబంధించి ఒకరి ఎసైన్డు భూమిని మరొకరి పేరున బదిలీ చేసేశారు.
విశాఖపట్నం చుట్టుపక్కల అనేక మండలాల్లో 1,072.40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరుల పేరుతో మార్చేశారు. వాటిని ప్రభుత్వ భూములుగానే వర్గీకరించి చూపుతున్నా పట్టాదారులుగా మాత్రం ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వెబ్‌ల్యాండ్‌లోకి వచ్చి చేరాయి. ఆ భూములు వారి పేరున ఎసైన్ చేశారో లేదో కూడా తహశీల్దార్లు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. భవిష్యత్తులో అవి తమ భూములే అంటూ ఆయా వ్యక్తులు తెరపైకి వస్తే లిటిగేషన్లకూ దారి తీయొచ్చు. మరోవైపు విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 75.23 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల్లో జిరాయితీ భూమిగా మార్చేశారు. విస్తీర్ణాన్ని కూడా 83.53 ఎకరాలకు పెంచేశారు. మరికొంత ప్రభుత్వ భూమిని ఎసైన్ చేసి, పేదలకు కేటాయించారు. తర్వాత కాలంలో వాటిని నిబంధనలకు విరుద్ధంగా వేరే వారి పేర్ల మీద మార్చేశారు.
మాజీ సైనికోద్యోగులు, పేదలు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు అమ్ముకోవాలంటే వాటిని 22ఏ జాబితా నుంచి మినహాయించాలి. వాటిని అమ్ముకునేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటూ నిరభ్యంతర పత్రాలు జారీ చేయాలి. విశాఖ కుంభకోణంలో ప్రధానంగా అక్రమాలన్నీ ఎన్వోసీల రూపంలోనే చోటు చేసుకున్నాయని సిట్ తేల్చింది. మంత్రులు, పెద్దల సిఫార్సులతోనే.. ఎలాంటి నిబంధనలూ పాటించకుండా ఎన్వోసీలు ఇచ్చేశారని స్పష్టం చేసింది.
ఆ భూముల రికార్డులేవీ అందుబాటులోనే లేవని పేర్కొంది. ఇలా అడ్డగోలుగా నిరభ్యంతర పత్రాలు జారీ చేసిన 68 కేసులు ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టికి వచ్చాయి. వాటిలో 52 కేసుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని దర్యాప్తులో బయటపడింది. మొత్తం 33 కేసుల్లో 138.16 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్ముకున్న వ్యవహారాల్లో దారుణమైన తప్పిదాలు జరిగాయని సిట్ గుర్తించింది. వీటికి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరపాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఈ అక్రమాలపై దర్యాప్తు చేసే క్రమంలో.. ఆయా భూమి రికార్డులు మాయమైనట్లు సిట్ బృందాలు గుర్తించాయి. నిరభ్యంతర పత్రాలు జారీ చేసిన 29 కేసులను పరిశీలిస్తే అందులో 22 కేసులకు సంబంధించి దరఖాస్తు రిజిస్టరే దొరకలేదు. మూడు కేసుల్లో కేవలం దరఖాస్తు రిజిస్టర్ జిరాక్సు ప్రతులు మాత్రమే లభించాయి. మరో మూడు కేసుల్లో డీఆర్ ఫైళ్లు దొరికినా వాటిలో అనేక తప్పులు కనిపించాయి. డీఆర్ ఫైళ్లు, మండల రికార్డులు, సబ్ డివిజన్ రికార్డులు, 10 (1) అడంగల్, ఐబీ రిజిస్టర్..ఇలా అనేక రెవెన్యూ రికార్డులు దర్యాప్తు సమయానికే మాయమైపోయాయి. ఇందుకు బాధ్యులెవర్నది గుర్తించే నాధుడే లేకుండా పోయారు. చాలా మంది తహశీల్దార్లు ఫలానా రికార్డు మాయమైందని తెలియజేయడం తప్ప ఆ దస్త్రం ఎందుకు కనిపించడం లేదు, అందుకు బాధ్యులు ఎవరన్న విషయాన్ని కూడా దర్యాప్తు బృందాలకు తెలియజేయలేకపోయారు.
ఈ భూములు అమ్ముకునేందుకు అనుమతులు జారీ చేసే క్రమంలో ఎక్కడా రికార్డులు సరిగా తనిఖీ చేయలేదని సిట్ తేల్చి చెప్పింది. తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సంబంధిత సెక్షన్ అధికారులు, డీఆర్వోలు, సంయుక్త కలెక్టర్లు, కలెక్టర్ సహా ఏ అధికారీ రికార్డులు పరిశీలించకుండానే భూములు అమ్ముకునేందుకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేశారు. ఎసైన్డ్ భూమి పొందినవారు అర్హులా కాదా అన్నదీ పరిశీలించ లేదు. భూములు అమ్ముకునేందుకు ఆస్కారం కల్పించే సమయంలోనూ క్షేత్రస్థాయి తనిఖీలు చేయలేదు. మాజీ సైనికోద్యోగులు ప్రభుత్వ భూమిని పొందేందుకు జిల్లా సైనిక సంక్షేమాధికారి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా ఎవరూ అలా చేయలేదు. పలు సందర్భాల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసేశారు. నకిలీ రికార్డులు సృష్టించి, వాటిని అధికారులకు సమర్పించినా సమగ్రంగా పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేశారు.
కుంభకోణం మొత్తం పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సిట్ కొన్ని సిఫారసులు చేసింది. ఏపీ భూ ఆక్రమణల చట్టం 1905 కింద 1,225.92 ఎకరాల భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నివేదించింది. ఏపీ ఎసైన్‌మెంట్ చట్టం 1977 కింద 751.19 ఎకరాలను పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొంది. 29 రిజిస్ట్రేషన్ డీడ్లు వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఏపీ రైట్స్ ఇన్‌ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం 1977 ప్రకారం 109 కేసుల్లో చర్యలు తీసుకోవాలని నివేదించింది. 50మంది ప్రైవేట్ వ్యక్తుల, 49మంది అధికారులపై పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. 134మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ నివేదికలో వెల్లడించింది.
ఇవీ చదవండి: