సింహాచల దేవస్థానం నాలుగో ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించారు. 2021-2022 సంవత్సరానికి సంబంధించి బోర్డు ఆర్ధిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. 40 అంశాలతో ట్రస్ట్ బోర్డ్ భేటీ అయ్యింది. సమావేశానికి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సంచైత గజపతి హాజరయ్యారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే వార్షిక కల్యాణం, చందనోత్సవాల ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.
40 అంశాలకు ఆమోదం..
దేవస్థానం ఈవో ప్రవేశపెట్టిన 40 అంశాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. 8 కోట్ల రూపాయలతో చేపట్టిన మెట్ల మార్గం.. కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో ప్రస్తుతానికి ఆ పనులను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది.
షూటింగ్ చేస్తే రూ.5 లక్షలు..
ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో షూటింగ్ నిర్వహించుకోవడానికి గతంలో రూ. 10 వేల రుసుం తీసుకునేవారు. ప్రస్తుతం దాన్ని రూ.5 లక్షల రూపాయలకు పెంచారు. అనంతరం ఆలయం లోపల భాగంలో షూటింగ్ నిర్వహించరాదని బోర్డు తీర్మానించింది. భక్తుల సౌకర్యాలు, కొవిడ్ నిబంధనలను పాటించడంపై చర్చించామని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అంతరాలయం వరకు భక్తులకు ప్రవేశం కల్పించాలా లేదా అన్న అంశంపై సమాలోచనలు జరిపినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం బోర్డ్ అంగీకారంతో అంతరాలయ దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ఈవో సూర్యకళ అధ్యక్షతన సమావేశమయ్యారు.
ఇవీ చూడండి : కొవిడ్‌ను తరిమికొట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదు: సీఎం