విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయుధాలు చేతపట్టి పులి వాహనంపై ఆశీనులై ఉన్న అమ్మవారి అవతారం విశేషంగా ఆకట్టుకుంది. పీఠం ప్రాంగణంలోని శమీ వృక్షం వద్ద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆయుధ పూజ నిర్వహించారు. అమ్మవారి అవతారాలలో ఉంచిన ఆయుధాలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథం, విశాఖ శ్రీ శారదాపీఠం వాహనాలకు ఆయుధ పూజ చేశారు.
యాగశాలలో 9 రోజులుగా నిర్వహిస్తున్న చండీయాగం పూర్ణాహుతిలో పీఠాధిపతులు పాల్గొన్నారు. చండీయాగంలో ఉంచిన కళాశాలను రాజశ్యామల అమ్మవారి ఆలయానికి తరలించి అభిషేకించారు. శరన్నవరాత్రి మహోత్సవాల ప్రారంభం నుంచి కొనసాగుతున్న శ్రీమత్ దేవీ భాగవత పారాయణ, శ్రీ చక్రానికి నవావరణ అర్చన విజయదశమి పర్వదినం రోజున ముగిశాయి. అమ్మవారి సాంస్కృతిక ఆరాధనలో భాగంగా ద్వారం త్యాగరాజు చేసిన గాత్ర కచేరీ ఆకట్టుకుంది.
పీఠాన్ని సందర్శించిన ప్రముఖులు
విజయదశమి పర్వదినం రోజున పలువురు ప్రముఖులు విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి అమ్మవారి పూజలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ పీఠాధిపతులతో కలిసి ఆయుధ పూజలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ గిరిజాశంకర్ పీఠాన్ని సందర్శించారు. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు.