యువతను మత్తుకు బానిసలుగా మార్చే వారి ఆట కట్టించేందుకు, అక్రమంగా మత్తు పదార్థాలు నిల్వ చేస్తూ రవాణా చేస్తున్న ముఠాల వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆరు నెలల కాలంలో ఎంతో ప్రత్యేకతను చాటుకుంది. విశాఖ నగరంలో ఎస్ఈబీ.. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వారికి గట్టి హెచ్చరికగా మారిందనే చెప్పాలి. మరోవైపు ఇసుక అక్రమ రవాణా, నిషేధిత ఆహార పదార్థాలు గ్యాంబ్లింగ్ వంటి ఆటలపైనా ఎస్ఈబీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.
165 కేసులు నమోదు
ఇప్పటివరకు 3 వేల టన్నుల అక్రమ ఇసుకకు సంబంధించి 165 కేసులను నమోదు చేశారు ఎస్ఈబీ అధికారులు. 15 వందల వరకు లిక్కర్ కేసులు నమోదు చేశారు. 67 కేసుల్లో 2 వేల 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసుల్లో ఎన్డీపీసీ చట్టాన్ని సైతం ప్రయోగిస్తున్నారు.
యాంటీ డ్రగ్ డ్రైవ్...
ఇలా.. కొద్ది నెలలుగా చేస్తున్న పనికి మరింత వేగాన్ని జోడిస్తూ ఈ నెల 22 వరకు ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ డ్రైవ్‌ను ఎస్ఈబీ ప్రారంభించింది. ద్రవ రూపంలో ఉండే గంజాయి, చాక్లెట్ల రూపంలో ఉండే మత్తు పదార్థాలు వంటి వాటిని సైతం ఈ ప్రత్యేక డ్రైవ్స్‌లో ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చెలరేగిపోతున్నాయని.. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఆలోచించి చైతన్యాన్ని రేకెత్తించే ప్రయత్నం చేయాలని ఎస్ఈబీ ఏడీసీపీ అజిత వేజండ్ల విజ్ఞప్తి చేస్తున్నారు.
పటిష్టమైన నిఘా
విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న నగరాలను లక్ష్యంగా చేసుకునే ముఠాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది ఎస్ఈబీ. వివిధ నగరాల నుంచి విశాఖ జిల్లాకు వచ్చి గంజాయిని తీసుకెళుతున్న వారి విషయంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ చర్యలకు దీటుగా ప్రజల సహకారం ఉండాలని.. ఇలాంటి విషయాల్లో అందించే సమాచారంపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అధునాతన గన్ను పరీక్షించిన డీఆర్డీఓ