విశాఖ జిల్లా మంగళాపురం గ్రామంలో వరి విత్తనాలు మొలకెత్తలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రంలోనే విత్తనాలు కొని నారుమడులు వేసుకున్నామని, మోసపోయామంటూ గగ్గోలు పెడుతున్నారు. మంగళాపురం ఆర్‌బీకేలో సుమారు వంద బస్తాల ఆర్‌జీఎల్ రకం విత్తనాలు కొనుగోలు చేశారు. 20 మంది వరకు రైతులు ముందుగా విత్తనాలు జల్లుకున్నారు. అయిదారు రోజులు గడిచినా మొలకలు సరిగా కనిపించలేదు. విత్తనాలు కూడా ముక్కిపోయినట్లు ఎర్రగా ఉన్నాయని, నాసిరకం వల్లే మొలక రాలేదని ఆవేదన చెందుతున్నారు. మిగిలిన రైతులందరూ భయపడి జల్లడం మానేశారు. ఇప్పుడు తమపరిస్థితి ఏమిటని?ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మేము భయపడి జల్లలేదు
గ్రామంలో కొందరు రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఈ విషయం తెలిసి మేం జల్లడం మానేశాం. కొనుగోలు చేసిన విత్తనాలు అలాగే ఉన్నాయి. వ్యవసాయాధికారులు వచ్చి చూడాలి. మా దగ్గర ఉన్న విత్తనాలు వెనక్కి తీసుకుని కొత్తవి ఇవ్వాలి. - భాస్కరరావు, మంగళాపురం
బయట కొన్న విత్తనాలే మొలక బాగా వచ్చాయి
రైతు భరోసా కేంద్రంలో ఒక బస్తా ఆర్‌జీఎల్ విత్తనాలు ఇచ్చారు. ఇవి చాలకపోవడంతో చోడవరంలోని ప్రైవేట్ దుకాణంలో మరో బస్తా కొనుగోలు చేశాను. ఒకేరోజు పక్కనే ఈ విత్తనాలు జల్లాను. చోడవరం నుంచి తెచ్చిన విత్తనాలు మొలక బాగా వచ్చాయి. రైతు భరోసా కేంద్రంలో ఇచ్చిన విత్తనాలు మొలక సరిగా రాలేదు. - పత్తి రామారావు, మంగళాపురం
నారుమడులు పరిశీలిస్తాం
రైతుల పొలాలకు వెళ్లి నారుమడులు పరిశీలిస్తాం. విత్తనాలు మొలక రాకపోవడానికి కారణాలు తెలుసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. - రూప, మండల వ్యవసాయాధికారిణి, బుచ్చెయ్యపేట
ఇదీ చదవండి: విశాఖ మూడోపట్టణ పీఎస్కు ఎల్‌జీ పాలిమర్స్ కేసు నిందితులు