విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం డెక్కన్ పరిశ్రమకు కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రహదారి విస్తరణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. దీనితో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలి నుంచి రాజవరం పరిశ్రమ వరకు పది నిమిషాల ప్రయాణం కాస్తా ఇరవై నిమిషాలు పడుతోంది. రహదారి పనులతో ఇళ్లలోకి భారీ ఎత్తున దుమ్మురేగి పడుతోందని మహిళలు వాపోతున్నారు.
ఈ రహదారి నుంచి సుమారు పది గ్రామాలకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి వస్తుంటారు. గుంతల కారణంగా వాహనాలు తప్పించే సందర్భంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు 35 కోట్లతో చేపడుతున్న ఈ రహదారి 2018 డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు పూర్తి కాలేదు.
రహదారి విస్తరణ పేరుతో ఎక్కడికక్కడ సాగునీటి కాలువలు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు తొలగించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సాగునీటి కాలువల్లోకి నీరు చేరుతుందో లేదోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ అధికారిని వివరణ కోరగా పనులను సకాలంలో పూర్తి చేసేందుకు సత్వర చర్యలు చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండి