విశాఖలో రింగువలల వివాదం మరింత ముదురుతోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం మత్స్యకారుల మధ్య సయోధ్య కుదిర్చినా ఫలితం కనిపించడం లేదు. ఇవాళ భీమిలి నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తత ఇందుకు నిదర్శనం. మంగమారి పేట, చేపలుప్పాడ జాలరిఎండాడకు చెందిన మత్స్యకార బోట్లు రింగువలలతో వేటకు వెళ్లాయి. సముద్రంలో వేటకు ఉపక్రమిస్తుండగా వందకు పైగా సంప్రదాయ మత్స్యకారుల పడవలు వారిని చుట్టుముట్టాయి. రింగువల వేయడానికి వీళ్లేదన్న హెచ్చరికల నడుమ అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు, మెరైన్ పోలీసు సిబ్బంది హుటాహుటిన స్పందించటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కుదరని సయోధ్య
గత నెల 30వ తేదీన ఇదే తరహా ఘర్షణ వాతావరణం సముద్రంలో నెలకొంది. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారం దిశగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చట్ట ప్రకారం రింగువలలతో వేట చేయవద్దని ఎక్కడా లేదు. దీనివల్ల ఇరు వర్గాల మధ్య ప్రభుత్వ పెద్దలు రాజీ కుదిర్చారు. ఇప్పటికే రింగువలలు ఉండి అనుమతి ఉన్నవాళ్లు 8 నాటికల్ మైళ్ల అవతల వేట చేసుకోవచ్చని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం మత్స్య శాఖ అధికారులు రింగువలలను పరిశీలించి నిబంధనల మేరకు అనుమతించారు. ఆ తరువాత జాలరి పేటకు చెందిన వాళ్లు 8 కిలోమీటర్ల అవతల వేట చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని వెళ్లారు. సముద్రంలోకి వెళ్లాక పరిస్థితి మారిపోయింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
మా పొట్ట కొట్టొద్దు
సంప్రదాయ మత్స్యకారుడు నెల రోజులు వేట చేసుకునే మత్స్య సంపదను, రింగ్ వలలతో ఒక రోజులో దోచుకుంటున్నారని పెద్ద జాలరి పేట గ్రామ మత్స్య కారులు అంటున్నారు. ఫలితంగా తమకు జీవనోపాధి పోతోందని చెబుతున్నారు. రింగ్ వలల వేటను పూర్తిగా నిషేదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై మత్స్య శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే రెండు వర్గాల వారితో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: