అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవల తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని.. తహసీల్దార్ కార్యాలయాల పని విధివిధానాలపై ఏసీబీ సమీక్షించడమే విడ్డూరంగా ఉందని అన్నారు. రెవెన్యూ శాఖకు జాబ్ చార్ట్ లేదని.. అక్కడున్న పరిస్థితులను బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తామని తెలిపారు.
ఉన్నతాధికారులకు ఎన్నో ఏళ్లుగా విశేషమైన అధికారాలను ప్రభుత్వం కల్పించింది. కానీ.. అనిశా జోక్యం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించకుండానే తిరస్కరణ అభియోగంలో తప్పు తమ ఉద్యోగులది కాదని.. వెబ్సైట్ లో లోపం ఉండటం కారణంగా రిజెక్ట్ అవుతున్నాయని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలు బీరువాల్లో కనిపించడం సాధారణ విషయమని.. అవి డబ్బులు కావని.. గ్రామాల్లో కొందరు పాసు పుస్తకాలకు దరఖాస్తులు చేసుకుని తిరిగి తీసుకోనివి అధికారుల వద్దనే ఆఫీసులో ఉన్నాయని తెలిపారు.
తమ పని విధానాలపై అనిశా చూపిన 4 అభియోగాలపై.. ఎక్కడా అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. రెవెన్యూ ఉద్యోగులను అనిశా మానసిక క్షోభను గురిచేయడం తగదని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తప్పిదాలకు పాల్పడితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారులకు ఉందని.. ఇతరుల జోక్యం అనవసరమని బొప్పరాజు అన్నారు.
ఇదీ చదవండి: