నాటకం అనేక సామాజిక వాస్తవాల విభిన్న దర్పణం. నేటికీ అధునాతన కళలకు చోదక శక్తిని అందించే రంగం. అలాంటి నాటక సృజనను... రానున్న తరాలకు అందివ్వాలని ఓ సామాన్యుడు స్వప్నించాడు. ఆ స్వప్న ఫలమే దేశంలోని తొలి నాటక గ్రంధాలయ ఆవిర్భావానికి కారణమైంది. ఆ మహా స్వాప్నికుడే విశాఖకు చెందిన బాదంగీర్ సాయి. తాను ప్రేమించే నాటక రచనలను నిక్షిప్తం చేసేందుకు ఏడు సంవత్సరాలు నాటక గ్రంథాలను నటులు, నాటక రచయితలు, సంస్ధలను అర్ధిస్తూ.. విలువైన సమాచారాన్ని సేకరించారు.
అంతే కాదు.. సేకరించిన ఆ నాటక గ్రంథాలను పదిలపరిచేందుకు ఇప్పటి వరకూ ఏడు చోట్ల నెలవును ఏర్పాటు చేశారు. పిల్లలను కాపాడే కోడిలా, పిల్లలను నోట కరచి రక్షిత స్ధలాల కోసం వెతుకులాడే పిల్లిలా నిరంతర సంచారి అయ్యారు. ఆ కృషికి ఫలితమే దేశంలోనే ఏకైక నాటక గ్రంథాలయంగా మహా విశాఖ నగర పాలక సంస్ధ శాశ్వత ప్రాతిపదికన రూపుదిద్దిన రంగసాయి నాటక గ్రంథాలయం.
నాటక వికాసానికి తోడ్పాటు
ప్రవృత్తి పరంగా నాటక కళాకారుడైన బాదంగీర్ సాయి.. నటనతో సరిపెట్టుకోకుండా నాటక వికాసానికి కూడా తన వంతు కృషి చేసేందుకు నిరంతరం తపిస్తూ నాటక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. దేశ, విదేశాల్లో ప్రసిద్ధి గాంచిన సురభి నాటకాలను విశాఖలో 40 రోజులపాటు ప్రదర్శింపజేశారు. అదే విధంగా విశిష్ట ప్రేక్షకాదరణ పొందిన అనేక నాటకాలను విశాఖ నగరంలో ప్రదర్శింపజేస్తూ 2010లో ఏర్పాటుచేసిన రంగసాయి నాటక సంఘం సంస్ధ ద్వారా కృషి చేశారు.
తెలుగు నాటక రంగ దినోత్సవం, ప్రపంచ నాటక రంగ దినోత్సవాల సందర్భంగా ఏటా మరుగుపడిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు, వారిని ఘనంగా సత్కరిస్తుంటారు సాయి. తాను ప్రదర్శించదలిచిన ఓ నాటకం పుస్తకం దొరకకపోవడంతో నాటక కళాకారుల ఇబ్బందుల ఆంతర్యాన్ని గుర్తించి, ఆనాడే నాటక పుస్తకాల సేకరణ ప్రారంభించి, 12వందల నాటక గ్రంథాలతో 2012లో 'రంగసాయి నాటక గ్రంథాలయం' ఏర్పాటు చేశారు.
తొమ్మిది వేల పుస్తకాలు
గ్రంథాలయం ఏర్పాటయితే జరిగింది కానీ, వాటిని భద్రపరిచేందుకు భవనం సమకూరకపోవడంతో, ఇప్పటి వరకూ ఏడు ప్రాంతాల్లో అద్దె సొంతంగా చెల్లిస్తూ, గ్రంథాలను కాపాడు కొంటూ వచ్చారు. అంతే కాదు ఆ నాటకాలను ఎవరైనా అడిగితే సొంత ఖర్చులతో జిరాక్సు తీయించి ఇచ్చేవారు. ఒక వైపు గ్రంథాలయం అద్దె, కరెంటు, నిర్వహణా వ్యయాన్ని భరిస్తూ. బాదంగీర్ సాయి శాశ్వత భవనాన్ని సమకూర్చమని విజ్ఞప్తి చేస్తూ అనేక ప్రభుత్వ సంస్ధల అధికారులను, కొందరు నాయకులను మొరపెట్టుకున్నారు.
ఒకనాడు 12 వందల నాటక గ్రంథాలతో ప్రారంభించిన నాటక గ్రంథాలయంలో ప్రస్తుతం తొమ్మిది వేల పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 300 మంది నాటక రచయితలు, 10 నాటక సంస్ధలకు చెందిన నాటక గ్రంథాలు ఈ లైబ్రరీలోనే ఉన్నాయి.ఎం.శ్రీనివాసరావు అనే వ్యక్తి 1500 పుస్తకాలను అందించారు. గ్రంథాలయానికి శాశ్వత భవనం సమకూరకపోవడంతో హుద్ హుద్ సమయంలో దాదాపు 800 పుస్తకాలు పాడైపోయాయి. వంద పుస్తకాలు 'చోరుల' బారినపడ్డాయి. ప్రస్తుతం ఉన్న తొమ్మిది వేల పుస్తకాల్లో తెలుగుతోపాటు కన్నడ, ఆంగ్ల నాటక రచనలు కూడా ఉన్నాయి.
డిజిటైలేజేషన్ కోసం ఎదురుచూపులు
అన్ని భారతీయ భాషల నాటక గ్రంథాలను సేకరించాలని భావించి, ఇప్పటికే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్.ఎస్.డి.) విద్యార్ధుల నుంచి పుస్తక సేకరణ ప్రారంభించారు సాయి. మహా విశాఖ నగర పాలక సంస్ధ రంగసాయి నాటక గ్రంథాలయానికి శాశ్వత వసతి కల్పించడంతో... నూతన ప్రాంగణంలో రెట్టించిన ఆనందంతో మరో ధ్యేయాన్ని నిర్దేశించుకున్నారు. అదే .. సేకరించిన నాటక గ్రంథాల 'డిజిటలైజేషన్'. అదే జరిగితే తెలుగు నాటకంతోపాటు, దేశీయ నాటక సృజన శాశ్వతంగా రానున్న తరాల కోసం నిక్షిప్తం చేసే మహదవకాశం కలుగుతుంది.
ఇందుకోసం ఇప్పటికే బాదంగీర్ సాయి తీవ్ర ప్రయత్నం చేశారు. గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం వ్యవస్ధాపకుడు ఎం.వి.వి.ఎస్.మూర్తి నాటక గ్రంథాలను డిజిటైలైజ్ చేసే ప్రాజెక్టును చేపట్టేందుకు అంగీకరించారు. అయితే ఆయన కాలం చేయడం కారణంగా ఆ యత్నం అలా నిలిచిపోయింది. గ్రంథాలయంలో ఆదివారం బాలలకు ఉచితి నాటక శిక్షణ, సోమవారం ఒక నాటకంపై విశ్లేషణ కార్యక్రమాలను నిర్వహిచేందుకు బాదంగీర్ సాయి ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే విశాఖలో రంగసాయి నాటక గ్రంథాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. రంగసాయి నాటక గ్రంథాలయం ఆధారంగా ఇద్దరు నాటక పరిశోధన కూడా చేయడం మరో విశేషం. నాటకాల కళను రక్షించేందుకు ఇంతగా పాటుపడుతున్న బాదంగీర్ సాయి.. అభినందనీయుడు.
ఇవీ చదవండి: